బంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దేశవ్యాప్తంగా ఒక్క బంగాల్ రాష్ట్రంలోనే హింసా రాజకీయాలు చెలరేగుతున్నాయని ఆరోపించారు.
'జన్-సంవాద్' ర్యాలీ పేరిట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బంగాల్ భాజపా కార్యకర్తల్ని ఉద్దేశించి దిల్లీ నుంచి ప్రసంగించారు అమిత్ షా. సార్వత్రిక ఎన్నికల్లో 303 సీట్లు సాధించినప్పటికీ తనకు మాత్రం బంగాల్లో గెలుపొందిన 18 సీట్లే అత్యంత ప్రాముఖ్యమైనవని వ్యాఖ్యానించారు. లక్షిత, వాయు దాడుల ద్వారా ఉగ్రవాదాన్ని సహించేది లేదని మోదీ సర్కార్ గట్టి సందేశాన్నిచ్చిందన్నారు షా.
బంగాల్లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అడ్డుకోవడంపైనా షా నిప్పులు చెరిగారు. దేశమంతా ఈ పథకం ఫలాలను పొందుతోందని, ఆఖరికి దిల్లీ ముఖ్యమంత్రి కూడా దీన్ని స్వాగతించారని.. మీరు మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారని బంగాల్ సర్కార్ను సూటిగా ప్రశ్నించారు కేంద్ర హోంమంత్రి.