పొల్లాచ్చి లైంగిక వేధింపుల కేసుపై ఆధికార అన్నాడీఎంకే పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమిళనాడు కోయంబత్తూరు సమీపంలోని పొల్లాచ్చిలో జరిగిన దారుణమైన ఘటనపై రాష్ట్రం మొత్తం నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి పళనిస్వామి మౌనంగా ఉన్నారని విమర్శించారు కమల్.
ఈ మేరకు ఆయన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో అన్నాడీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కమల్. బాధితుల పేర్లు బయటికి రావడం సహా ఆందోళన చేస్తున్న విద్యార్థులను బలవంతంగా తరిమికొట్టడంపై మండిపడ్డారు.
ఈ విషయాలన్నీ వినబడటం లేదా సీఎం... అంటూ ప్రశ్నించారు.
మహిళలపై లైంగింక దాడులను తీవ్ర నేరంగా పరిగణించడం, కేసును సీనియర్ అధికారులతో దర్యాప్తు చేయించాలన్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత మాటలను గుర్తుచేశారు. జయలలిత అడుగుజాడల్లో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్లు చెప్పుకునే అన్నాడీఎంకే... ఈ అంశంపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు.