అబ్బురపరిచే ఆకృతిలో నిర్మించనున్న అయోధ్య రామ మందిరం నాణ్యతలోనూ దానికదే సాటిగా నిలవనుంది. ఎంతలా అంటే వెయ్యేళ్లయినా ఆలయం చెక్కుచెదరదని నిపుణులు చెబుతున్నారు. భూకంపం సంభవించినా.. రిక్టర్‌స్కేల్‌పై 10 తీవ్రత నమోదైనా ఆలయానికి ఏమీకాని విధంగా ప్రఖ్యాత ఆర్కిటెక్ట్, చంద్రకాంత్ సోమ్‌పుర డిజైన్ చేశారు. ప్రధాన ఆలయాన్ని రెండెకరాల విస్తీర్ణంలో నిర్మిస్తారు. మిగతా స్థలంలో అనేక రకాల చెట్లు పెంచడంతో పాటు.. మ్యూజియమ్, ఆలయానికి సంబంధించిన భవనాలను నిర్మిస్తారు. ఆలయం ఎన్నటికీ చెక్కుచెదరని రీతిలో ఉండేందుకు గాను ఇక్కడి భూసారాన్ని 200 అడుగుల లోతు వరకు తవ్వి పరీక్షించారు. ఆలయ రూపలావణ్యం, ఆకృతిలోని సౌందర్యం గానీ వెయ్యేళ్ల వరకు అలాగే నిలుస్తుందని నిర్మాణ పనుల సూపర్‌వైజర్ అన్నుభాయ్ సోమ్‌పుర తెలిపారు. ఒకేసారి 10 వేలమంది భక్తులు దర్శించుకొనేందుకు వీలుగా డిజైన్ చేశారు.
మూడు లక్షల దీపాల కాంతులు..
రామ మందిరం భూమిపూజ సందర్భంగా కనీవినీ ఎరుగని రీతిలో అయోధ్యలో 3 లక్షల దీపాలు వెలిగించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 5న భూమిపూజ జరగనున్న నేపథ్యంలో 3, 4 తేదీల్లో అయోధ్యలోని అన్ని ప్రధాన ఆలయాలు, మఠాల్లో ఈదీపాలను వెలిగిస్తారు. విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు అందరూ ఇందులో పాలుపంచుకుంటున్నారు. తొలుత లక్షా 22 వేల దీపాలు వెలిగించాలని అనుకున్నా.. తర్వాత నగరమంతా భారీఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకుగాను డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ భారీ ఏర్పాట్లు చేస్తోంది.
ప్రపంచ పర్యటక హబ్
అయోధ్య అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ ఉప కులపతి డాక్టర్ మనోజ్ దీక్షిత్ 'ఈటీవీ భారత్'కు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యటక పరమైన అనేక ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు వెల్లడించారు. అయోధ్య ప్రపంచ ప్రఖ్యాత పర్యటక హబ్‌గా అభివృద్ధి చెందుతుందన్నారు. డజను దాకా పెద్ద హోటళ్లు, అతిథిగృహాలు, అంతర్జాతీయ బస్ టెర్మినళ్లు వంటివన్నీ వస్తాయన్నారు. అయోధ్య నుంచి అనేక చారిత్రక నగరాలు, పట్టణాలను కలిపేందుకు ప్రత్యేకంగా రోడ్ల నిర్మాణానికి గాను ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.