'విశ్వాసం' పూర్తయింది.. కేబినెట్ కూర్పుపై యడ్డీ దృష్టి మంత్రివర్గ విస్తరణపై కసరత్తు ప్రారంభించారు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప. సోమవారం విధానసభలో బలం నిరూపించుకున్న ఆయన... కేబినెట్ కూర్పుపై దృష్టి సారించారు. ఈ వారం చివరికల్లా మంత్రివర్గాన్ని ప్రకటిస్తారని భాజపా సీనియర్ నేత సురేశ్ కుమార్ తెలిపారు.
" విశ్వాస పరీక్షలో భాజపా నెగ్గింది. ఒక దశ పూర్తయింది. ఇక కేబినెట్ విస్తరణే తరువాయి. పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకులు సమావేశమై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటారు. ఈ వారం చివర్లోగా మంత్రివర్గంపై ప్రకటన వస్తుంది. "
-సురేశ్ కుమార్, భాజపా సీనియర్ నేత
స్పీకర్ ఎన్నిక బుధవారం
యడియూరప్ప బలపరీక్ష నిరూపించుకున్న అనంతరం స్పీకర్ పదవికి రాజీనామా చేశారు రమేశ్ కుమార్. ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు నూతన సభాపతి ఎన్నిక బుధవారం జరుగుతుందని కర్ణాటక అసెంబ్లీ కార్యదర్శి ఎం.కే విశాలాక్షి తెలిపారు. మంగళవారం మధ్యాహ్నంలోగా స్పీకర్ పదవికి పోటీ చేయాలనుకునే వారు నామినేషన్లు సమర్పించాలని తెలిపారు.
నామినేటెడ్ పోస్టులు రద్దు
రాష్ట్ర ప్రభుత్వ బోర్డులు, కార్పొరేషన్లు, కమిషన్ల అధ్యక్ష, ఉపాధ్యక్షులు, ఇతర నియామాకాలను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు సీఎం యడియూరప్ప. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రస్తుతం పదవిలో ఉన్న వారే తాత్కాలికంగా కొనసాగాలని సూచించారు. ప్రభుత్వ అదనపు కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శుల నియామాకాలకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:'యువతరానికి మార్గదర్శకంగా ఉండాలనే ఈ పని..'