ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. రెండోసారి భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
దిల్లీలోని రాష్ట్రపతి భవన్ ఎదుట బహిరంగ స్థలంలో అంగరంగ వైభవంగా కార్యక్రమం జరగనుంది. ప్రపంచ దేశాధినేతలు, అన్ని రాష్ట్రాల ప్రముఖులు, పార్టీ గెలుపు కోసం కృషి చేసిన భాజపా కార్యకర్తల కుటుంబాల సమక్షంలో ఘనంగా జరగనుందీ వేడుక. రాత్రి 7 గంటలకు జరగనున్న కార్యక్రమంలో నరేంద్ర మోదీతో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మోదీతో ప్రమాణం చేయించనున్నారు.
మంత్రివర్గంలో ఎవరెవరు...?
మంత్రి వర్గంలో ఎవరెవరు ఉంటారనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. కూర్పుపై పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు మోదీ. కేంద్ర ప్రభుత్వంలో కీలకం కాగలరని భావిస్తున్న షాకు ఏ మంత్రిత్వ శాఖ దక్కుతుందోనని ఉత్కంఠ నెలకొంది.
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 353 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. భాజపానే స్వయంగా 303 సీట్లు నెగ్గి పూర్తి మెజార్టీ సాధించింది. కాంగ్రెస్ 52 స్థానాలకే పరిమితమైంది.
8 వేల మందికి పైగా అతిథులు...
ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భావించిన భాజపా.. వేల మందికి ఆహ్వానాలు పంపింది. కార్యక్రమానికి దాదాపు 8 వేల మంది అతిథులు హాజరుకానున్నట్లు సమాచారం. రాష్ట్రపతి భవన్లో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద కార్యక్రమం అని పేర్కొన్నారు రాష్ట్రపతి భవన్ ప్రతినిధి అశోక్ మాలిక్.