డిసెంబర్ 20న ఫిరోజాబాద్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారి పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు తలెత్తాయి. అజయ్ కుమార్ అనే పోలీసు అధికారిని ఓ గుంపు చుట్టుముట్టి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో పోలీసు తల, చేతికి తీవ్రగాయాలయ్యాయి. దేవుడిలా వచ్చి ఆ పోలీసును కాపాడాడు హాజీ ఖాదిర్.
'ఆ సమయంలో నేను నమాజ్ చేస్తున్నాను. ఇంతలో ఒక పోలీసును దుండగులు చుట్టుముట్టి కొడుతున్నట్టు నాకు తెలిసింది. బయటకు వచ్చి చూసిన నాకు తీవ్రంగా గాయపడిన పోలీసు కనిపించాడు. అతని వద్దకు వెళ్లి రక్షిస్తానని నేను మాటిచ్చాను. ఆ సమయంలో అతనెవరో, పేరేమిటో కూడా తెలియదు. కేవలం మానవత్వం కోసమే నేను అతడిని రక్షించాను' అని హాజీ ఖాదిర్ చెప్పాడు.