దేశవ్యాప్త లాక్డౌన్ సమయంలో వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్ల ద్వారా ప్రయాణించిన వారిలో మొత్తం 97మంది కూలీలు మరణించినట్లు కేంద్రం వెల్లడించింది. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా.. రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ సెప్టెంబర్ 9వరకు నమోదైన గణాాంకాలని రాజ్యసభకు స్పష్టం చేశారు మంత్రి పీయూష్ గోయల్.
అయితే.. మొత్తం 97 మృతుల్లో.. 87 కేసులను మాత్రమే పోస్టుమార్టం కోసం పంపారని ఈ సందర్భంగా గోయల్ తెలిపారు. వీటిలో 51 మందికి సంబంధించిన వివరాలు తమవద్దకు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. మరణించిన వారిలో గుండెపోటు, మెదడు సంబంధిత వ్యాధి, మూత్రపిండాల సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులే అధికంగా ఉన్నారని చెప్పారు మంత్రి.