ఆపదలో ఉన్న పిల్లలకు ఆపన్నహస్తం అందించేందుకు ఏర్పాటు చేసిన చైల్డ్‌లైన్ 1098కు చెందిన ఓ నివేదిక నిర్ఘాంతపోయే విషయాలను వెల్లడించింది. బాలల హక్కుల రక్షణ కోసం ఏర్పాటైన ఈ హెల్ప్‌లైన్‌కు దాదాపు 40 శాతం 'సైలెంట్ కాల్స్' వస్తున్నాయట. 2018 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు దాదాపు 86 లక్షల ఫోన్‌కాల్స్ ఈ తరహాలో వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
'చైల్డ్‌లైన్'లో చిన్నారుల మౌనవేదన
By
Published : Oct 30, 2020, 4:11 PM IST
శారీరక, మానసిక వేధింపులకు గురవుతున్న చిన్నారులు, వివిధ కారణాల వల్ల బాల కార్మికులుగా మారిన బాలబాలికలు చైల్డ్‌లైన్ సెంటర్‌కు కాల్ చేస్తుంటారు. అయితే ఫోన్ చేసిన బాధితులు ఎక్కువగా 'సైలెంట్ కాల్స్' చేయడాన్ని అధికారులు గుర్తించారు. తమ హక్కుల ఉల్లంఘనలపై నోరు మెదపలేక, ఇబ్బంది పెడుతున్న వారిపై ఫిర్యాదు చేసే ధైర్యం చేయలేక చిన్నారులు మౌన వేదన అనుభవిస్తున్నారట.
సైలెంట్ కాల్ అంటే...
సైలెంట్ కాల్స్ అంటే ఫోన్ చేసిన బాధితుడు/కాలర్ మాట్లాడకుండా కాల్‌ను హోల్డ్‌లోనే ఉంచుతారు. అయితే ఆ పరిసర ప్రాంతాల శబ్దాలు లేదా నాయిస్ మాత్రం అవతలి వ్యక్తి(రిసీవర్)కు వినిపిస్తుంది.
24 గంటలూ అందుబాటులోనే..
'చైల్డ్‌లైన్ 1098' సేవలు 24/7 అందుబాటులో ఉన్నాయి. ఇది దేశవ్యాప్తంగా దాదాపు 595 జిల్లాల్లో విస్తరించి సేవలు అందిస్తోంది. ఇదే కాకుండా రైల్వేశాఖ ఆధ్వర్యంలో 134 చైల్డ్ హెల్ప్ డెస్క్‌లు కూడా ఉన్నాయి. ఈ సెంటర్లకు కాల్ చేస్తే అక్కడ ఉండే సిబ్బంది.. పిల్లలు ఎదుర్కొంటున్న ఒత్తిడి, వారి మానసిక సమస్యలను తెలుసుకొని ధైర్యం చెప్తారు. ఇబ్బందుల్లో ఉంటే అధికారులు రంగంలోకి దిగి తక్షణమే సాయం చేస్తారు.
ఎన్నికాల్స్ వచ్చాయంటే...
2018 జనవరి నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు దాదాపు 2.15 కోట్ల ఫోన్‌కాల్స్.. ఈ హెల్ప్‌లైన్‌కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో దాదాపు 86 లక్షల మంది 'సైలెంట్ కాల్స్' చేసినట్లు స్పష్టం చేశారు.
" సైలెంట్ కాల్స్ అంటే బాధితులు సాయం కోసం ప్రయత్నిస్తున్నట్లు లెక్క. అయితే ఆ సమయంలో వారికి మాట్లాడేందుకు ధైర్యం సరిపోదు. చాలా సందర్భాల్లో హెల్ప్‌లైన్ సభ్యులు వారికి ధైర్యం చెప్పి కౌన్స్లింగ్ ఇచ్చినప్పుడు బాధిత వ్యక్తులు తమ గోడు చెప్పుకుంటారు. ఒక్కోసారి ఒకే నంబర్ నుంచి 100 సార్లు కాల్స్ చేస్తారు. అయితే అన్నిసార్లు మాట్లాడకుండా ఉన్న కాలర్.. చివరికి 101 కాల్లో ధైర్యం చేసి తమ బాధ చెప్తారు.అందుకే మేము ఎలాంటి సైలంట్ కాల్స్‌ను డిస్కనెక్ట్ చేయం."
-- ఓ అధికారి
సైలెంట్ కాల్స్ గతంలో ఇంకా ఎక్కువగా వచ్చేవని.. గత మూడేళ్లుగా వాటి సంఖ్య తగ్గినట్లు అధికారులు వెల్లడించారు.
సంవత్సరం
మొత్తం కాల్స్
సైలెంట్ కాల్స్
2018
1.01 కోట్లు
42 లక్షలు
2019
69 లక్షలు
27 లక్షలు
2020(సెప్టెంబర్ వరకు)
43 లక్షలు
16 లక్షలు
ఇదే కారణం..
నిశ్శబ్ద కాల్స్ సంఖ్య తగ్గటానికి చిన్నారులు ఈ హైల్ప్‌లైన్ సేవలు, చర్యల గురించి అవగాహన పొందటమే కారణమని అధికారులు వెల్లడించారు. చాలా మంది చిన్నారులు తమ గోడు చెప్పుకోడానికి ధైర్యం చేస్తున్నట్లు చెప్పారు.
"గత మాడేళ్లుగా సైలెంట్ కాల్స్ సంఖ్య తగ్గుతున్నాయి. మా చర్యలు, ప్రచార కార్యక్రమాల వల్ల చిన్నారుల్లో ఈ హైల్ప్‌లైన్ గురించి మరింత అవగాహన పెరుగుతోంది. చాలా మంది పిల్లలు తామ సమస్యల్లో చిక్కుకోకుండా సాయం పొందవచ్చని భావిస్తున్నారు. చాలా సందర్భాల్లో బాలబాలికలు ఆపన్నహస్తం కోసం కాల్ చేసి.. ఈ నంబర్‌కు కాల్ చేస్తే ఏం జరుగుతుంది? అని కూడా ఆరా తీస్తుంటారు"
--ఓ అధికారి.
దేశవ్యాప్తంగా 18 ఏళ్లలోపు పిల్లలకు అన్నిరకాలుగా రక్షణ కల్పించడం కోసం ఈ చైల్డ్‌లైన్ సేవలు అందిస్తోంది. కొవిడ్-19 లాక్డౌన్ సమయంలో సైలెంట్ కాల్స్ సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు అధికారులు గుర్తించారు.