మాజీ ఎంపీలు దిల్లీలోని అధికారిక బంగ్లాలను ఖాళీ చేయాలని లోక్‌సభ ప్యానెల్ సూచించినా ఇంకా 82 మంది ఖాళీ చేయలేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సీఆర్ పాటిల్ నేతృత్వంలోని లోక్‌సభ హౌసింగ్ కమిటీ గత నెల 19న సుమారు 200 మంది మాజీ ఎంపీలకు బంగ్లాలు ఖాళీ చేయాలని సూచించింది. ఖాళీ చేయకుంటే నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించగా.. పలువురు నివాసాలను వీడారు. అయినా 82 మంది తమకు కేటాయించిన బంగ్లాల్లోనే నివాసముంటున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
'మాజీ'లైనా భవనాలు ఖాళీ చేయని ఎంపీలు! - ఎంపీలు
ప్రభుత్వం కేటాయించిన అధికారిక భవనాలను ఇప్పటికీ పలువురు మాజీ ఎంపీలు ఖాళీ చేయలేదు. ఈ జాబితాలో దాదాపు 82 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితంగా కొత్తగా ఎన్నికైన ఎంపీలకు తాత్కాలిక భవనాల్లో నివాస సదుపాయం కేటాయించారు అధికారులు.
ఇప్పటికీ అధికారిక బంగ్లాలను ఖాళీ చేయని మాజీ ఎంపీలపైహౌసింగ్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆక్రమణదారుల చట్టం కింద ఖాళీ చేయిస్తామని, ఒకసారి దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాక విద్యుత్, మంచినీరు, వంట గ్యాస్ వంటి సదుపాయాలు నిలిచిపోతాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
లోక్‌సభ రద్దైన తర్వాత నెలలోపు మాజీ ఎంపీలు తమ బంగ్లాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. మే 25న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 16వ లోక్‌సభను రద్దు చేయగా.. మోదీ నేతృత్వంలోని కొత్త మంత్రివర్గం రెండోసారి కొలువుదీరింది. మాజీ ఎంపీలు తమ బంగ్లాలు ఖాళీ చేయని నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన ఎంపీలకు తాత్కాలిక భవనాల్లో నివాస సదుపాయం కేటాయించాల్సి వస్తోంది.