సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. భారత సైన్యం తన అమ్ములపొదిలో అత్యాధునిక ఆయుధాలను చేర్చుకోవడానికి సిద్ధమవుతోంది. అమెరికా నుంచి 72 వేల సిగ్ సావర్ అస్సాల్ట్ రైఫిళ్లను దిగుమతి చేసుకొనే ప్రక్రియను వేగవంతం చేసినట్లు సంబంధిత వర్గాల సమాచారం.
సరిహద్దుల్లో ఎదురవుతోన్న కొత్త సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా భారత సైన్యాన్ని శక్తిమంతం చేయాలని 2017లోనే ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా అత్యాధునిక ఆయుధాలను అందించడానికి చర్యలు ప్రారంభించారు అధికారులు. 7 లక్షల రైఫిళ్లు, 44 వేల మెషీన్ గన్లు(తక్కువ బరువుతో కూడినవి), 44,600 కార్బైన్ తుపాకులు సమకూర్చుకోవడానికి ప్రణాళికలు రచించారు.