తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్​: వడదెబ్బకు 2 రోజుల్లో 70 మంది బలి - ఉష్ణోగ్రత

వడదెబ్బకు బిహార్‌ ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడు వేడి గాలుల కారణంగా బిహార్‌లో గత రెండురోజుల వ్యవధిలో 70 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఒక్కరోజే 40 మంది మృత్యువాత పడ్డారు.

బిహార్​: వడదెబ్బకు 2 రోజుల్లో 70 మంది బలి

By

Published : Jun 16, 2019, 10:44 AM IST

ఏటా వేసవిలో ఉష్ణోగ్రతల స్థాయి పెరుగుతూ వస్తోంది. జూన్ నెల వచ్చినా భూతాపంతో కొన్నిచోట్ల 45 డిగ్రీల సెల్సియస్​తో భానుడు విరుచుకుపడుతున్నాడు. బిహార్​లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. వడదెబ్బకు గత రెండు రోజుల్లో రాష్ట్రంలో 70 మంది ప్రాణాలు కోల్పోయారు.

శనివారం ఒక్కరోజే 40 మంది మృత్యువాత పడ్డారు. వేడిగాలులు, వడ దెబ్బల ప్రభావం ఔరంగాబాద్, గయా, నవాడా జిల్లాలలో అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వడదెబ్బ కారణంగా ఔరంగాబాద్‌లో గత రెండు రోజుల వ్యవధిలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. గయాలో 12 మంది, నవాడాలో 13 మంది మృత్యువాత పడ్డారు.

బిహార్‌ వ్యాప్తంగా గత పదేళ్లలో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా పాఠశాలలను ఈ నెల 19 నుంచి ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఆస్పత్రుల్లో చేరుతున్న వారిసంఖ్య పెరుగుతోందన్న అధికారులు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు చెబుతున్నారు.

వడదెబ్బకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వడదెబ్బ మృతుల పట్ల సానుభూతి తెలియజేశారు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. నివారణ
చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details