మన సౌలభ్యం కోసం ప్లాస్టిక్ వస్తువులను తరచుగా ఉపయోగించడం అలవాటే. కానీ ఈ అలవాటు మూగ జీవాల పాలిట మృత్యువుగా తయారైంది. మనం వాడిన ప్లాస్టిక్ వస్తువులను చెత్తకుప్పలో పడేసి చేతులు దులుపుకుంటున్నాం. ఆహార వేటలో ఆ మూగ జీవాలు ప్లాస్టిక్ వస్తువులను తిని తీవ్ర అస్వస్థతకు గురవుతున్నాయి. ఇందుకు హరియాణాలో జరిగిన ఘటన ఓ ఉదాహరణ మాత్రమే.
హరియాణా హిసార్‌లోని తలవండీ రాణా గోశాలకు చెందిన ఆవును చికిత్స నిమిత్తం పశువైద్యశాలకు తీసుకెళ్లారు. పొట్ట లావుగా ఉండటం చూసి గోవు గర్భం దాల్చి ఉంటుందని అందరూ భావించారు. ఆపరేషన్ మొదలుపెట్టాక అసలు విషయం తెలిసి వైద్యులు నివ్వెరపోయారు. పొట్ట నిండా దాదాపు 45కిలోల చెత్త ఉంది. అందులో అధిక భాగం పాలిథీన్దే. దీనితో పాటు ఇనుప వస్తువులు, రబ్బరు వస్తువులు కూడా ఉన్నాయి.