ప్రభుత్వాలు ఆరోగ్యకరమైన ఆహారం మీద దృష్టి సారిస్తే 2025 నాటికి 37 లక్షల మంది ప్రాణాలు కాపాడవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో తెలిపింది. ఈ సందర్భంగా పోషక విలువలను పెంచేందుకు తగు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం మానవుని ఆరోగ్యకరమైన జీవితానికి పోషకాహారం ఎంతో అవసరమని పేర్కొంది.
శరీరానికి అందే ఆహారంలో అన్నింటికన్నా పోషకాలు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్ధ అసిస్టెంట్ డైరక్టర్ జనరల్ నాకో యమమోటో తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి ఈ మార్గదర్శకాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
"ప్రజల ఆరోగ్యం కోసం ప్రపంచంలోని అన్ని దేశాలు పోషక విలువలను పెంపొదించేందుకు కృషి చేయాలి. సరైన పోషక విలువలు అందక 90 లక్షల మంది పిల్లలలో ఊబకాయం పెరుగుతోంది. 1990-2018 మధ్య కాలంలో 4.8 నుంచి 5.9 శాతం పెరిగింది. పెద్ద వయసు వారిలో 13 శాతంగా ఉంది. ఈ సంఖ్య అన్ని దేశాలలో క్రమంగా పెరుగుతూ వస్తోంది."
-నివేదిక