దేశంలో 2019లో 43 వేల మంది రైతులు, కూలీలు ఆత్మహత్య చేసుకున్నట్లు జాతీయ నేర నమోదు విభాగం (ఎన్సీఆర్బీ) నివేదించింది. దేశవ్యాప్తంగా నమోదైన ఆత్మహత్యల్లో రోజువారీ కూలీలవే 23.4 శాతంగా ఉన్నాయని తాజా నివేదికల ద్వారా తెలిసింది.
2018తో పోలిస్తే గతేడాది రోజువారీ కూలీల ఆత్మహత్యలు పెరిగాయి. 2018లో 30,132 మంది ప్రాణాలు తీసుకోగా.. 2019లో 32,563 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది.
రైతు సంక్షోభం..
వ్యవసాయ రంగంలో మొత్తం 10,281 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మొత్తం ఆత్మహత్య బాధితుల్లో వీరు 7.4 శాతంగా ఉన్నారు. 2018లో 10,349 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు.
- రైతులు- 5,857 మంది (పురుషులు 5,563; మహిళలు 394 మంది)
- వ్యవసాయ కూలీలు- 4,324 మంది (పురుషులు 3,749; మహిళలు 575 మంది)
మహారాష్ట్రలోనే అధికం..
రైతు ఆత్మహత్యలు మహారాష్ట్రలోనే అధికంగా 38.2 శాతం నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో కర్ణాటక (19.4), ఆంధ్రప్రదేశ్ (10 శాతం), మధ్యప్రదేశ్ (5.3 శాతం), తెలంగాణ (4.9 శాతం) ఉన్నాయి. అయితే, బంగాల్, బిహార్, ఒడిశా, ఉత్తరాఖండ్, మణిపుర్ రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలు నమోదు కాలేదని తెలిపింది ఎన్సీఆర్బీ.