శరీరంలో కిడ్నీ వంటి కీలక అవయవాల్లో ఒక్క రాయి ఏర్పడినా.. అల్లాడిపోతారు. సాధారణంగా అలాంటి రాళ్లు కడుపులో ఐదు, పది రాళ్లు వస్తాయి. కానీ.. హరియాణా కైథల్ జిల్లాలో ఓ వృద్ధుడి పొట్ట.. రాళ్ల దిబ్బగా మారింది. శస్త్ర చికిత్స చేసిన వైద్యులే ఆశ్చర్యపోయేలా.. అతడి కడుపులోంచి ఏకంగా 2,215 రాళ్లు బయటపడ్డాయి. గంటల తరబడి శ్రమించి వాటిని తొలగించారు. ఇంత భారీస్థాయిలో రాళ్లు బయటపడటం రికార్డే అని చెబుతున్నారు డాక్టర్లు.
కైథల్ జిల్లాలోని తితరమ్ గ్రామానికి చెందిన శ్రీచంద్ అనే వృద్ధుడు కడుపునొప్పితో బాధపడుతూ జిల్లాలోని జైపుర్ ఆసుపత్రిలో చేరాడు. ఈ క్రమంలో పరీక్షలు నిర్వహించిన ఆసుపత్రి వైద్యులు అతని పొట్టలో రాళ్లు ఉన్నట్లు నిర్ధరించారు. అనంతరం శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించారు. కడుపులోంచి మొత్తం 2,215 వివిధ సైజుల్లోని రాళ్లు బయటపడినట్లు చెప్పారు. వాటిని లెక్కించేందుకు గంటన్నర సమయం పట్టినట్లు తెలిపారు.