తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా సంక్షోభం మధ్య ఎన్నికలకు బిహార్​ సన్నద్ధం

కరోనా కాలంలోనూ దేశాన్ని వేడెక్కిస్తున్న అంశం బిహార్​ ఎన్నికలు. ఓ పక్క మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నప్పటికీ.. ప్రతిపక్షాలు ఇప్పడు ఎన్నికలు వద్దని గగ్గోలు పెడుతున్నప్పటికీ ఎలక్షన్స్​ జరిపేందుకే మొగ్గు చూపుతోంది ఈసీ. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో బిహార్‌లో ఎన్నికల నగారా మొగనుంది. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైంది. కరోనా సంక్షోభంలో జరగనున్న మొదటి ఎన్నికలు ఇవే కావటం గమనార్హం.

2020 Bihar Legislative Assembly election
కరోనా వేళ వేడెక్కిస్తున్న బిహార్ ఎన్నికలు

By

Published : Sep 7, 2020, 10:02 PM IST

బిహార్‌ రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. అవకాశవాద రాజకీయ కూటములు, కుటుంబ కలహాలు, ప్రత్యర్థులపై కక్ష సాధింపులు.. అన్నింటికీ మించి అభ్యర్థుల విజయం కోసం ఎంతకైనా తెగించే అసాంఘిక ముఠాలు.. వీటన్నింటికీ అడ్డా.. బిహార్‌ గడ్డ. ఇక్కడ రాజకీయాలకంటే రసందాయకంగా ఉంటుంది.. ఎన్నికల నిర్వహణ. బిహార్‌లో స్వేచ్ఛగా, సక్రమంగా ఎలెక్షన్ల పూర్తిచేయటం.. నిర్వాచన్‌ సదన్‌ సామర్థ్యానికి పరీక్ష పెడుతుంటుంది. ఈసారి అంతకుమించిన మరో సవాల్‌... కొవిడ్‌ మహమ్మారి నుంచి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలోనే బిహార్‌లో ఎన్నికల నగారా మోగనుంది. కరోనా కాష్ఠంలో ఎన్నికలు వాయిదా వెయ్యాలన్న విజ్ఞప్తులు వచ్చినా... నిర్వహణకే నిర్ణయించింది ఈసీ. మరికొన్ని రోజుల్లో బిహార్‌లో ఎన్నికల వేడి రాజుకోబోతోంది. కరోనా కల్లోలంలో జరగనున్న మొదటిఎన్నికలు ఇవే.

మోగనున్న ఎన్నికల నగారా..

బిహార్‌లో ఎన్నికల నగారా మోగనుంది. కరోనా కల్లోలంలోనే అక్కడి శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. సరికొత్త ఎన్నికలకు, వినూత్న నిర్వహణకు బిహార్‌ ఎలెక్షన్స్‌ వేదిక కానున్నాయి. కోవిడ్‌తో మొదలైన సరికొత్త సాధారణం.. ఎన్నికల నిర్వహణలో భాగం కానుంది. బిహార్‌ ఎన్నికలు సాధారణ సమయాల్లోనే సాఫీగా ఉండవు. అసాంఘిక శక్తులు, హింస, ముఠా రాజకీయాలకు వేదికైన ఆ రాష్ట్రంలో... ఎన్నికల నిర్వహణ ఈసీకి ఎప్పుడూ కత్తిమీద సామే. ఇప్పుడు కరోనా మహమ్మారితో పరిస్థితులు అన్ని మారిపోయాయి. సాధారణ జనజీవనమే అసాధారణంగా జీవించాల్సిన పరిస్థితులు. ఇక పేదరికం, నిరక్షరాస్యతలో ముందు నిలిచే బిహార్‌ను ఈ ఏడు వరదలు కూడా అతలాకుతలం చేశాయి. ఈ తరుణంలో ఎన్నికల నగారా మోగుతుండటం.. బిహార్‌, ఈసీ వైపు దేశమంతా ఆసక్తిగా చూసేలా చేశాయి.

ఎన్నికలకే మొగ్గు...

243 స్థానాల బిహార్‌ అసెంబ్లీ కాలావ్యవధి.. వచ్చే నవంబరు నెలాఖరుకల్లా ముగిసిపోనుంది. దాదాపు 7.2 కోట్లమంది ఓటర్ల ఉన్న బిహార్ వంటి రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించటం వ్యయప్రయాసలకు పరీక్షే. ఈ నేపథ్యంలోనే బిహార్లో ఎన్నికల్ని కనీసం కరోనా ఉద్ధృతి తగ్గేవరకైనా వాయిదా వెయ్యాలని పలు రాజకీయ పక్షాల నుంచి ఈసీకి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటికే లక్షా 17వేల మందికి కరోనా సోకింది. అయిదువందల మందికిపైగా అభాగ్యులు కొవిడ్‌ మహమ్మారి వల్ల మరణించారు. బిహార్‌లో వైరస్‌ మరింతగా విజృంభించే ప్రమాదం ఉందని పలు నివేదికలు ఘోషిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రాబోయే ప్రమాదాన్ని చూపిస్తూ... ఎన్నికల వాయిదాయే సరైందని రాజకీయపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, తగు జాగ్రత్తలతో ప్రజాస్వామ్యంలో అత్యంత కీలమైన ఎన్నికలను నిర్వహించడానికే నిర్వాచన్‌ సదన్‌ మొగ్గుచూపుతోంది.

బ్యాలెట్​కు మొగ్గు...

నెలరోజుల క్రితమే ఎన్నికల నిర్వహణకు నిర్ణయం తీసుకున్న ఎలెక్షన్‌ కమిషన్‌.. రాష్ట్రంలోని పార్టీలను ఈ కాష్ఠంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి తమ ఆలోచనలు పంచుకోవాలని, సూచనలను ఇవ్వాలని కోరింది. ఇందుకు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించే ఉద్దేశంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. చాలాపార్టీలు రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడత ఎన్నికలు జరపాలని, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్ని పక్కనపెట్టి బ్యాలెట్‌ పత్రాలకు మళ్లాలని, జన సమూహ ర్యాలీలకు అనుమతించాలని కోరుతున్నాయి. అలాగే, ఎన్నికల వ్యయ పరిమితుల్ని పెంచాలని, కొవిడ్‌ రక్షణల ఖర్చునీ అభ్యర్థి వ్యయంనుంచి మినహాయించాలని పార్టీలు ఎలెక్షన్‌ కమిషన్‌కు సూచనలు అందించాయి.

ముఖ్యంగా బిహార్‌లోని ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తోంది. కోవిడ్‌ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికలను వాయిదా వేయాలంటూ ఎన్‌డీఏ కూటమిలోని ఎల్‌జేపీ కోరింది. నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ కూడా ఇదే రకమైన డిమాండ్లు వినిపిస్తోంది. ఎన్నికల నిర్వహణపై కొన్ని పార్టీలు అంతకుముందే ఈసీకి లేఖ కూడా రాశాయి. ఆర్​జేడీతో పాటు సీపీఎం ఎన్నికల్లో వర్చువల్‌ ప్రచారాన్ని వ్యతిరేకించాయి. అలాగే, డిజిటల్‌ ర్యాలీలు సైతం అనుమతించకూడదని విజ్ఞప్తి చేశాయి. మహమ్మారి సమయంలో ఎన్నికల అవసరం ఏముందని రాష్ట్రంలో ఉన్న 9ప్రధాన పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. కానీ, భాజపా ఇప్పటికే రాష్ట్రంలో డిజటల్ ప్రచారంలో దూసుకెళ్తోంది. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

కరోనాకు తోడుగా వరదలు...

ప్రస్తుతం బిహార్‌లో కరోనాతో పాటు వరదలు సైతం తీవ్రంగా... విధ్వంసం సృష్టించాయి. కొవిడ్‌–19 మహమ్మారికి తోడుగా.. రాష్ట్రంలో సంభవించిన వరదలు బిహార్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా కలవరపెట్టాయి. వరదల దాటికి ఇప్పటికీ పలు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి. వరదల ప్రభావంతో రాష్ట్రంలోని చాలా జిల్లాలు ప్రభావితమయ్యాయి. దాదాపు ఎనిమిది లక్షల మంది ఇబ్బందులు పడుతుండగా.. పద్నాలుగు వేల మంది వరకు ఆవాసాలు కోల్పోయి పునరావాసాల కేంద్రాల్లో తలదాచుకున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం బిహార్‌ రాష్ట్రం వరదల నుంచి క్రమంగా కోలుకుంటుండగా.. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 73 శాతం వరకు ఉండటం కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకే ఎన్నికల సంఘం మొగ్గుచూపుతోంది.

34 దేశాల్లో నిర్వహణ..

ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్నీ... 6 నెలలుగా కలవరపెడుతున్న కరోనా. ప్రజల జీవితాలనే పూర్తిగా మార్చేసింది. విరుగుడు లేకుండా కొవిడ్‌ మాహమ్మారి విరుచుకుపడుతున్న వేళా ప్రపంచవ్యాప్తంగా 34 దేశాల్లో విజయవంతంగా ఎన్నికలు జరిగాయి. 10వేలకుపైగా కేసులు 220 మరణాలతో వాతావరణం భయానకంగా ఉన్న ఏప్రిల్‌ నెలలోనే... దక్షిణ కొరియా సార్వత్రిక ఎన్నికలు దిగ్విజయంగా నిర్వహించింది. ఈ మధ్యనే శ్రీలంక సైతం... పార్లమెంటరీ ఎలెక్షన్లను ఏ ఇబ్బంది లేకుండా ముగించింది. మన దేశంలో విదేశీ దురాక్రమణ, అంతర్గత తిరుగుబాటు వంటి ఆత్యయిక పరిస్థితుల్లో తప్ప ఎన్నికల్ని వాయిదా వేయరాదన్న రాజ్యాంగ నియమం ఉంది. ఒకవేళ ఏదైనా కారణంతో ఎన్నికలు నిర్వహించలేని పక్షంలో ఈసీ న్యాయశాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు గల కారణాలు తెలపాల్సి ఉంటుంది. గడువు ముగిసినా ఎన్నికలు జరగకపోతే ఆ రాష్ట్రం పాలన కేంద్రం చేతిల్లోకి వెళ్తుంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణకే మొగ్గుచూపిన ఈసీ అందుకు సర్వం సిద్ధం చేసుకుంటోంది.

సరికొత్త నిబంధనలు..

మొత్తంగా ఈ కల్లోలం మధ్యలోనే... బిహార్‌ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఎలెక్షన్ల నిర్వహణకు ఆ రాష్ట్రంలో ఉండే క్షేత్రస్థాయి సవాళ్లకు తోడు కొవిడ్‌... పరిస్థితిని క్లిష్టంగా మార్చేసింది. అందుకు అనుగుణంగానే... కొత్త మార్గదర్శకాలతో సరికొత్త నిబంధనలతో ఈసీ ముందుకొచ్చింది. ఈ కొవిడ్‌ నియంత్రణ సూత్రాలతోనే అక్టోబర్‌–నవంబర్‌ నెలల్లో ఎన్నికలు జరుగుతాయని ఈసీ ఇప్పటికే సంకేతాలిచ్చింది. మొత్తంగా రానున్న రోజుల్లో సాధారణం కానున్న సరికొత్త ఎన్నికల నమూనా బిహారులో ఆవిష్కృతం కానుంది

ABOUT THE AUTHOR

...view details