నిర్భయ కేసు: దోషి వినయ్ క్షమాభిక్ష పిటిషన్ - latest nirbhaya update
19:14 January 29
నిర్భయ కేసు: దోషి వినయ్ క్షమాభిక్ష పిటిషన్
నిర్భయ కేసులో ఎన్నో మలుపులు తిరుగుతున్నాయి. ఉరి శిక్ష అమలును ఆలస్యం చేసేందుకు దోషులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. తాజాగా నలుగురు దోషుల్లో ఒకరైన వినయ్ కుమార్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ వినియోగించుకున్నాడు. క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా.. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్వీకరించినట్లు వినయ్ తరఫు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు. ఈ కారణంతో.. ఫిబ్రవరి 1న నిర్భయ దోషుల ఉరి శిక్ష అమలుపై మరోసారి సందేహాలు నెలకొన్నాయి. మరోసారి మరణ శిక్ష వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదివరకే నిర్భయ కేసులో వినయ్ క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేయగా.. సుప్రీం కోర్టు కొట్టివేసింది. వినయ్ కంటే ముందు దోషుల్లో ఒకడైన ముకేశ్ కుమార్ సింగ్ దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్ను జనవరి 17న రాష్ట్రపతి తిరస్కరించారు. తన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ముకేశ్ దాఖలు చేసిన మరో పిటిషన్ను సుప్రీం కోర్టు బుధవారం కొట్టేసింది.