ఎంత దూరమైనా కాలినడకన ప్రయాణించేవాళ్లం అని తాతయ్యలు చెప్పడమే కానీ.. ఈ రోజుల్లో అలా వెళ్లేవాళ్లు చాలా అరుదు. పనికోసం ముంబయికి వెళ్లిన ఓ వ్యక్తి మాత్రం కాలినడకన రెండువేల కిలోమీటర్లు ప్రయాణించి ఔరా అనిపించాడు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు దేశంలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ముంబయిలో పనిలేక.. ఇంటికి వెళ్లేందుకు రవాణామార్గాలు దొరకక కాలినడకే శరణ్యమనుకున్నాడు. కట్టుబట్టలతో.. కాలినడకతో ప్రయాణం ప్రారంభించాడు. సంకల్ప బలంతో 22 రోజులపాటు నడిచి ఇల్లు చేరాడు.
బిహార్లోని దర్బంగా జిల్లా పంచభోగ్ గ్రామవాసి హరివంశ్ చౌదరి. గత రెండేళ్లుగా ముంబయిలో ఓ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడు. కరోనా వైరస్ ఆందోళన కారణంగా యజమాని అతనికి ఆశ్రయం కల్పించేందుకు నిరాకరించాడు. ఈ నేపథ్యంలో కాలినడకన ప్రయాణం ప్రారంభించాడు హరివంశ్. మధ్యలో కొద్ది దూరంపాటు బస్సులో ప్రయాణించి మధ్యప్రదేశ్లోని ఇటార్షి వరకు చేరాడు. అనంతరం ఏ రవాణా సాధనం దొరక్క కాళ్లకే పనిచెప్పాడు.
"నేను నా బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకుని ట్రైన్ టికెట్ కొనుగోలు చేశాను. ఆ తర్వాత దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. నా టికెట్ రద్దు అయిందని సమాచారం అందింది. ఇక నేను కాలినడకన ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. మధ్యప్రదేశ్ పోలీసులకు కృతజ్ఞతలు చెప్పాలి. తినేందుకు ఆహారం ఇచ్చారు. దారి ఖర్చులకు రూ. 200 సాయం చేశారు."
-హరివంశ్ చౌదరి, బహుదూరపు బాటసారి
ఉత్తర్ప్రదేశ్ పోలీసులు తనతో కాస్త కటువుగా వ్యవహరించారని చెప్పాడు హరివంశ్. "మీ గ్రామానికి వెళ్లేందుకు అనుమతి ఎవరు ఇచ్చారు" అని ప్రశ్నిస్తూ కొట్టినట్లు తెలిపాడు. కరోనా వైరస్ భయంతో దారిలో ఎవరూ కనీసం మంచినీళ్లు ఇవ్వడానికైనా ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. కాలికి బొబ్బలు వచ్చాయని.. చాలాదూరం ప్రయాణించడం వల్ల నొప్పులు ఇబ్బంది పెట్టేవని చెప్పాడు.