నేడు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ను ప్రారంభించనున్న మోదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణాటక పర్యటన రెండో రోజుకు చేరింది. నేడు బెంగళూరులో జరిగే 107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సును ప్రధాని ప్రారంభించనున్నారు. అగ్ర శాస్త్రవేత్తలు, విధాన రూపకర్తలు, విద్యావేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు సహా.. ఇద్దరు నోబెన్ బహుమతి గ్రహీతలు కూడా ఈ సదస్సులో పాల్గొననున్నారు.
ఐదు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో నోబెల్ గ్రహీతలు స్టీఫన్ హెల్, అడా ఇయోనాథ్.. వివిధ రంగాలకు చెందిన 15 వేల మంది ప్రముఖులు పాల్గొంటారని నిర్వాహకులు వెల్లడించారు.
గ్రామీణాభివృద్ధికి శాస్త్ర, సాంకేతిక వినియోగం అనే అంశమే ప్రధాన ఎజెండాగా జరిగే ఈ సదస్సులో.. వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడం.. పరిశ్రమలు, రైతుల మధ్య సమన్వయం పెంచడంపై చర్చించనున్నారు. పంట ఉత్పాదకతను పెంచడం, గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరచడం వంటి అంశాలపై కూడా దృష్టి సారించనున్నారు. దేశంలో నిపుణులైన రైతులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. రైతులకు ఉపయోగపడే ఆవిష్కరణలు, ఆలోచనలపై సుదీర్ఘంగా చర్చిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'పౌరచట్టంపై కాదు.. పాక్కు వ్యతిరేకంగా నిరసనలు చేయండి'