సార్వత్రిక ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంటున్నా ఈవీఎం సమస్యలు మాత్రం వదలడం లేదు. దేశ రాజధాని దిల్లీలోని రైల్వే జుగ్గి, షకుర్బస్తీ సహా పలు చోట్ల ఈవీఎంల మొరాయింపు ఓటర్లతో పాటు ఈసీకి తలనొప్పి తెచ్చి పెట్టింది.
వేసవి కావడం వల్ల ఎండ తాకిడికి తట్టుకోలేక ఉదయాన్నే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. అయితే ఈవీఎంల మొరాయింపుతో 3 పోలింగ్ కేంద్రాల్లో 50 నిమిషాలు ఆలస్యంగా ఓటింగ్ ప్రారంభమైంది. అప్పటివరకు ఓటర్లు క్యూలోనే వేచి ఉండాల్సి వచ్చింది. పలువురు ఓటర్లు ఈసీపై అసహనం వ్యక్తం చేశారు.
బంగాల్లో మళ్లీమళ్లీ...
ఆరో విడత పోలింగ్‌లోనూ బంగాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఘాటాల్ లోక్‌సభ నియోజకవర్గం భాజపా అభ్యర్థి భారతి ఘోష్ వాహనశ్రేణిపై కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. తృణమూల్ కార్యకర్తలే దాడి చేశారని భాజపా నేతలు ఆరోపించారు.
అదే కథ: ఈవీఎం సమస్యలు- బంగాల్లో ఘర్షణలు కాల్పుల కలకలం...
ఆరోదశ పోలింగ్ ముందు రోజు బంగాల్లో స్వల్ప హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. జాడ్గ్రామ్ నియోజకవర్గ పరిధిలోని గోపిబళ్లాపుర్లో భాజపా కార్యకర్త శనివారం రాత్రి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. మరో ఇద్దరు కార్యకర్తలపై కాల్పులు జరిగాయి.