తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కశ్మీర్​లో 13వేల మంది యువత అదృశ్యం​' - సయీదా హమీద్

అధికరణ 370, 35ఏ రద్దు తర్వాత జమ్ముకశ్మీర్​లో సుమారు 13వేల మంది యువత కనిపించకుండా పోయారని అక్కడ పర్యటించిన నిజ నిర్ధరణ కమిటీ అంచనా వేసింది. ఈనెల 17-21 మధ్య కశ్మీర్​లోని షోపియన్​, పుల్వామా, బందిపొరా ప్రాంతాలను పరిశీలించిన కమిటీ దిల్లీలో మంగళవారం నివేదిక విడుదల చేసింది.

'కశ్మీర్​లో 13వేల మంది యువత అదృశ్యం​'

By

Published : Sep 25, 2019, 12:55 PM IST

Updated : Oct 1, 2019, 11:16 PM IST

'కశ్మీర్​లో 13వేల మంది యువత అదృశ్యం​'

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370, 35ఏ రద్దు సందర్భంగా ఆంక్షలు విధించింది కేంద్ర ప్రభుత్వం. సమాచార వ్యవస్థ, అంతర్జాలాన్ని నిలిపివేసింది. అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఈనెల 17-21 మధ్య ఐదుగురు సభ్యుల నిజ నిర్ధరణ కమిటీ కశ్మీర్​లో పర్యటించింది.

కశ్మీర్​లోని షోపియన్​, పుల్వామా, బందిపొరా జిల్లాల్లో పర్యటించిన బృందం దిల్లీకి చేరుకుని మంగళవారం నివేదిక విడుదల చేసింది. కశ్మీర్​లో భద్రతా బలగాలు మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని ఆరోపించింది. ఆగస్టు 5 నుంచి ఇప్పటి వరకు సుమారు 13వేల మంది యువత కనిపించకుండా పోయారని అంచనావేసింది.

కశ్మీర్​లో ఆంక్షలు సడలించి సాధారణ పరిస్థితులు కల్పించాలని డిమాండ్​ చేశారు కమిటీ సభ్యురాలు, ముస్లిం మహిళా ఫోరమ్​ అధ్యక్షురాలు సయీదా హమీద్​.

" ఇది అంచనా మాత్రమే. అధికారింగా ఎలాంటి ధ్రువీకరణ లేదు. కశ్మీర్​లో ఎంత మంది కనిపించకుండా పోయారని మానవహక్కుల కార్యకర్తలు, సంబంధిత ప్రజలు లెక్కించే ప్రయత్నంలో భాగంగా సుమారు 13వేల మందిగా తేలింది.
మా ప్రధాన డిమాండ్లలో మొదటగా కశ్మీర్​ అంతటా ఎన్నడూ లేని విధంగా మోహరించిన బలగాలను తొలగించాలి. అక్కడ ప్రతి నలుగురు కశ్మీరీలకు ఒక భద్రత సిబ్బంది ఉన్నారు. అలాగే వారికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370, 35ఏ ను తిరిగి పునరుద్ధరించాలి."

-సయీదా హమీద్​, ముస్లిం మహిళా ఫోరమ్​ అధ్యక్షురాలు.

నిజ నిర్ధరణ కమిటీలో సయీదాతో పాటు ఈ బృందంలో అన్నీ రాజా (నేషనల్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియన్​ ఉమెన్- ఎన్​ఎఫ్​ఐడబ్ల్యూ​), పూనం కౌశిక్​ (ప్రగతిశీల మహిళా సమితి), కావల్​జీత్​ కౌర్​, పంఖూరి జహీర్​ (ఎన్​ఎఫ్​ఐడబ్ల్యూ) ఉన్నారు.

నివేదిక..

జమ్ముకశ్మీర్​లో చాలా ప్రాంతాల్లో రాత్రి 8 గంటల తర్వాత ఒక్క పౌరుడు కూడా రోడ్లపైకి వచ్చే పరిస్థితులు లేవని నివేదిక పేర్కొంది. బందిపొరాలో ఓ బాలిక బోర్డు పరీక్షల కోసం విద్యుత్​ దీపం వెలిగించినందుకు ఆమె తండ్రి, అన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. అక్కడ మానవ హక్కులకు భంగం కలుగుతోందనడానికి ఇదే నిదర్శనమని తెలిపింది. వైద్య సేవలు కూడా అందడం లేదని తెలిపింది.

ఆచూకీ కావాలంటే..

తమ పిల్లలు కనిపించకుండా పోయారని అధికారులను సంప్రదిస్తే వారి ఆచూకీ తెలిపేందుకు సుమారు రూ. 20-60 వేల వరకు డిమాండ్​ చేస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు కమిటీ సభ్యులు. జమ్ముకశ్మీర్​ భవిష్యత్తు కోసం తీసుకోబోయే నిర్ణయాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని డిమాండ్​ చేశారు. తక్షణమే ఆంక్షలు సడలించి, సమాచార వ్యవస్థను పునరుద్ధరించాలని కోరారు.

ఇదీ చూడండి: 'ఉగ్రచర్యలను ఎదుర్కొనేందుకు పూర్తి సిద్ధంగా సైన్యం'

Last Updated : Oct 1, 2019, 11:16 PM IST

ABOUT THE AUTHOR

...view details