తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉచిత గ్రంథాలయాన్ని తెచ్చిన చిన్నారి ఆలోచన

ఆమె వయస్సు 12 ఏళ్లు. సాధారణంగా ఈ వయస్సులో ఎవరైనా ఏం చేస్తారు..? స్నేహితులతో ఆడుకుంటారు. పాఠశాలకు వెళ్తారు. కేరళ కోచిలోని ఈ చిన్నారి మాత్రం ఉచితంగా ఓ గ్రంథాలయాన్నే నడుపుతోంది. ఇక్కడకు ఎవరైనా వచ్చి తమకు నచ్చిన పుస్తకాలు చదవొచ్చు. ఇంటికి పట్టుకుని వెళ్లొచ్చు. ఇంత చిన్న వయసులో అంత గొప్ప ఆలోచన ఎలా వచ్చిందో...?

By

Published : Jul 15, 2019, 3:02 PM IST

ఉచిత గ్రంథాలయాన్ని తెచ్చిన చిన్నారి ఆలోచన

ఉచిత గ్రంథాలయాన్ని తెచ్చిన చిన్నారి ఆలోచన

కేరళ కోచికి చెందిన 12 ఏళ్ల చిన్నారి యశోద డీ షెనోయ్​కు పుస్తకాలంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అలవాటు. అయితే పుస్తకాలు చదవడమే కాదు... నలుగురిని చదివించాలనుకుంది. ఈ కోరికతోనే ఆమె ఏకంగా 3,500 పుస్తకాలతో ఓ ఉచిత గ్రంథాలయాన్ని నడుపుతోంది.

ఎలా సాథ్యం..?

పుస్తకాలు కొని చదవడం కాకుండా... అవి చదవాలనే కోరిక ఉన్నవారికి ఉచితంగా ఇవ్వాలనుకుంది యశోద. ఈ ఆలోచనను తండ్రికి చెప్పగా... ఆమె ఆకాంక్షను ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు. అనూహ్య స్పందన వచ్చింది. ఎన్నో ప్రాంతాల నుంచి పలువురు పుస్తకాలు పంపారు. ఇలా మట్టంచెర్రీలో ఉన్న తన ఇంటి పైభాగంలోనే 6 నెలల క్రితం 2,000 పుస్తకాలతో గ్రంథాలయం ప్రారంభించింది.

క్రమేపీ పుస్తకాల సంఖ్య పెరిగింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు పనిచేసే ఈ గ్రంథాలయంలో ఏ పుస్తకమైన ఉచితంగా తీసుకెళ్లవచ్చు.

"నేను మూడో తరగతిలో పుస్తకాలు చదవడం ప్రారంభించా. ఇక్కడ దగ్గరలోని వేరే గ్రంథాలయానికి మా అన్నయ్య వెళ్లేవాడు. తనతో పాటు నేనూ వెళ్లేదానిని. పుస్తకాలు తెచ్చుకుని చదివేదాన్ని. ఒక పుస్తకం 15 రోజులు ఉంచుకోవచ్చు. అయితే నేను 17 రోజులు అంటే 2 రోజులు ఎక్కువ ఉంచుకున్నా. ఈ కారణంగా నాన్న అక్కడ డబ్బులు కట్టాల్సి వచ్చింది. నేను చూసి ఎందుకు డబ్బులు ఇచ్చారు అని అడిగా. అప్పుడు నాన్న 'ఇది సమాజసేవ కాదు. ఏ పుస్తకం ఉచితంగా రాదు' అన్నారు. అప్పుడు ఈ ఆలోచన వచ్చింది.
ఇది చాలా పెద్ద గ్రంథాలయం. ఇక్కడ అన్ని విధాల పుస్తకాలు దొరుకుతాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు, 2 ఏళ్ల వయస్సు పిల్లల పుస్తకాలు కూడా దొరుకుతాయి. ఈ గ్రంథాలయంలో ప్రస్తుతం 110 మంది సభ్యులున్నారు."
- యశోద డీ షెనోయ్, గ్రంథాలయ నిర్వాహకురాలు

ఎవరైనా రాలేకపోతే...?

ఎవరైనా గ్రంథాలయానికి రాలేని పరిస్థితుల్లో ఉంటే వారి ఇళ్లకు పుస్తకాలు పంపిస్తుండటం విశేషం. గ్రంథాలయ నిర్వహణలో ఆమెకు కుటుంబమంతా సహకరిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details