భారత్- నేపాల్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారత పౌరులపై నేపాల్ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. లగాన్ యాదవ్ అనే వ్యక్తిని నేపాల్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటన స్థానికులకు, నేపాల్ సాయుధ పోలీసు బలగాల(ఏపీఎఫ్) మధ్య జరిగిందని సశస్త్ర సీమా బల్ పట్నా సరిహద్దు ఐజీ సంజయ్ కుమార్ తెలిపారు. వికాస్ యాదవ్ అనే వ్యక్తికి ఛాతీ భాగంలో బుల్లెట్ తగలటం వల్ల చనిపోయినట్లు వెల్లడించారు.
18 రౌండ్ల కాల్పులు..
భారతీయ పౌరులపై 18 రౌండ్ల కాల్పులు జరిపాయి నేపాలీ బలగాలు. కాల్పుల మోతతో సమీపంలో పనులు చేస్తున్న కూలీలు పరుగులు తీశారు. భయంతో ఇళ్లల్లోనుంచి బయటకు వచ్చేందుకు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనలో మరింత మంది గాయపడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.
సీతామడి జిల్లాలోని జానకీ నగర్, నేపాల్ సర్లాహి మధ్య సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన ఎస్ఎస్బీ ఆ ప్రాంతంలో బలగాలను మోహరించింది. నేపాల్ కూడా బలగాలను తరలించింది.
స్థానిక ఘర్షణ..
నేపాల్ భూభాగంలో ఉదయం 8.40 గంటలకు ఈ కాల్పులు జరిగినట్లు సశస్త్ర సీమా బల్ డీజీ కుమార్ రాజేశ్ చంద్ర తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని, ఘటన జరిగిన వెంటనే నేపాల్ అధికారులతో స్థానిక కమాండర్లు సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించారు.
"నేపాల్లోని సర్లాహి ఎస్పీతో బిహార్ సితామడి ఎస్పీ మాట్లాడారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇది పూర్తిగా స్థానిక సమస్య. వాగ్వాదం వల్ల జరిగిన కాల్పులు ఇవి. ఇది దీర్ఘకాలం కొనసాగదు. ప్రాథమిక విచారణ ఆధారంగా సేకరించిన నివేదికను కేంద్ర హోంశాఖకు సమర్పించాం."
- కుమార్ రాజేశ్ చంద్ర, ఎస్ఎస్బీ డీజీ