భారత్‌లో పాముకాట్లకు మరణించే వారి సంఖ్య భారీగా పెరిగింది. 2000 నుంచి 2019 మధ్య కాలంలో విషసర్పాలకు బలైనవారి లెక్కలను విడుదల చేసింది కెనడాలోని టొరంటో యూనివర్సిటీ. ఈ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ గ్లోబల్ హెల్త్ రీసెర్చ్(సీజీహెచ్‌ఆర్)లో భారత్, బ్రిటన్ భాగస్వామ్యంతో పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ సంస్థ నివేదిక ప్రకారం 19 ఏళ్లలో 12 లక్షల మంది పాముకాట్ల వల్ల మరణించినట్లు అంచనా వేశారు. ఇందులో ఎక్కవ ప్రమాదాలు జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య జరిగినట్లు స్పష్టం చేశారు.
పాముకాట్లతో ప్రాణాలు కోల్పోయిన వారిలో.. 30 నుంచి 69 ఏళ్ల వయసున్న వాళ్లు దాదాపు సగం మంది, పావు శాతం మంది 15 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులే ఉన్నారు. 70 శాతం ప్రమాదాలు 8 రాష్ట్రాల్లోనే జరిగినట్లు వెల్లడించారు పరిశోధకులు. వర్షాకాలం, మంచుపొగ ఉన్న సమయాల్లో ఈ ఘటనలు ఎక్కువగా చోటుచేసుకున్నట్లు తెలిపారు. 70 ఏళ్ల క్రితం స్నేక్ బైట్‌కు చనిపోయిన వారి సగటు 250 మందిలో ఒక్కరు ఉంటే.. ఇప్పడు మాత్రం 100 మందిలో ఒకరు ఉన్నట్లు వెల్లడంచారు.
సకాలంలో వైద్యం అందకపోవడం, నివారణ, చికిత్స విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్లే ఈ తరహా మరణాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటికీ సాధారణ ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో దాదాపు 26 కోట్ల మంది నివాసం ఉంటున్నట్లు వెల్లడించారు. ఇందులో ప్రతీ 167 మందిలో ఒకరికి పాముకాటు ముప్పు ఉందన్నారు పరిశోధకులు. దేశవ్యాప్తంగా 270 జాతుల పాములు ఉండగా.. 60 రకాలు మాత్రమే విషసర్పాలని, అవి కాటేస్తే కచ్చితంగా చికిత్స అవసరమని తెలిపారు.