తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉదయం నలుగురు జవాన్లు హత్య.. సాయంత్రం మరొకరు.. ఆ సైనిక స్థావరంలో ఏం జరుగుతోంది?

పంజాబ్ బఠిండాలోని సైనిక స్థావరంలో మరో జవాను అనుమానాస్పదంగా మరణించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కొందరు అంటుండగా.. మిస్​ ఫైర్ జరిగి ఉండొచ్చని కూడా అధికారులు అనుమానిస్తున్నారు.

బఠిండాలోని మిలిటరీ స్టేషన్‌లో మరో సైనికుడు మృతి
బఠిండాలోని మిలిటరీ స్టేషన్‌లో మరో సైనికుడు మృతి

By

Published : Apr 13, 2023, 11:18 AM IST

Updated : Apr 13, 2023, 11:57 AM IST

పంజాబ్​.. బఠిండాలోని మిలిటరీ స్టేషన్‌లో మరో జవాను అనుమానాస్పద రీతిలో మరణించారు. బుధవారం ఉదయం అగంతుకులు జరిపిన దాడిలో నలుగురు సైనికుల మరణించిన కొద్ది గంటలకే ఇలా జరగడం కలకలం రేపింది. బుధవారం సాయంత్రం ఆ జవాను తూటా గాయంతో చనిపోయినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే.. మిలిటరీ స్టేషన్‌పై కాల్పులకు, జవాన్ అనుమానాస్పద మృతికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఆర్మీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో లఘు రాజ్ శంకర్​ అనే సైనికుడు మృతి చెందారు. బుల్లెట్​ గాయం కారణంగానే సైనికుడు చనిపోయారు. లఘు రాజ్ శంకర్​ తన సర్వీస్​ గన్​తో సెంట్రీ డ్యూటీ చేస్తున్న సమయంలోనే ఘటన జరిగింది. వెంటనే లఘు రాజ్​ శంకర్​ను.. అక్కడి వారు ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అయినా లాభం లేకపోయింది.

లఘు రాజ్ తల కుడి భాగంలో బుల్లెట్​ గాయమైనట్లు బఠిండా సైనిక స్థావరం అధికారులు వెల్లడించారు. లఘు రాజ్ ఏప్రిల్​ 11వ తేదీనే సెలవులు ముగించుకుని విధుల్లో చేరారని చెప్పారు. "సైనికుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా మేము భావిస్తున్నాం. అదే సమయంలో ప్రమాదవశాత్తు గన్​ ఫైరింగ్​ జరిగి ఉంటుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బుధవారం బఠిండాలోని మిలిటరీ స్టేషన్​పై అగంతుకులు జరిపిన కాల్పులకు, జవాన్​ మృతికి ఎటువంటి సంబంధం లేదు." అని ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు.

కాల్పుల ఘటనపై వెలుగులోకి కొత్త విషయాలు..
నలుగురు జవాన్ల మృతికి కారణమైన పంజాబ్‌ బఠిండాలోని సైనిక కేంద్రంలో జరిగిన కాల్పుల ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సివిల్‌ దుస్తుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ కాల్పులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. మాస్క్‌లు ధరించి ఈ దారుణానికి తెగబడినట్లు వెల్లడించారు. కుర్తా పైజామా ధరించిన ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్​ నమోదు చేశారు. కాల్పుల అనంతరం నిందితులు దగ్గర్లోని అడవిలోకి పారిపోయినట్లు పేర్కొన్నారు. మీడియాలో వచ్చిన కథనాలను బట్టి ఓ అనుమానితుడిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

ఘటన జరిగిన ప్రదేశంలో సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాల్పులు ఎవరు జరిపారో ఇంకా స్పష్టత లేదని పోలీసులు తెలిపారు. ఒకరి చేతిలో ఇన్సాస్ రైఫిల్, మరొకరి చేతిలో గొడ్డలి ఉన్నట్లు సమాచారం. 22 రౌండ్ల తూటాలతో సహా రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఇన్సాస్ రైఫిల్ అంశం దీనికి కారణమా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు సైన్యం పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు భద్రతా బలగాలు ఎవ్వరినీ అదుపులోకి తీసుకోలేదు.

Last Updated : Apr 13, 2023, 11:57 AM IST

ABOUT THE AUTHOR

...view details