Bangalore IT Raid Today : కర్ణాటక బెంగళూరులో జరుగుతున్న ఐటీ సోదాల్లో భారీగా నగదు బయటపడుతుతోంది. ఇటీవల నగరంలో ఓ మాజీ కార్పొరేటర్ బంధువు ఇంట్లో రూ.42 కోట్లు బయటపడగా.. తాజాగా ఓ బిల్డర్ ఫ్లాట్‌లో రూ.40 కోట్లు దొరికాయి. రాజాజీనగర్ కేటమారనహళ్లిలోని బిల్డర్ అపార్ట్మెంట్లోని 5వ అంతస్తులో శనివారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దొరికిన నగదు గురించి బిల్డర్‌ను ఆరా తీయగా.. ఓ మాజీ ఎమ్ఎల్సీ పేరు చెప్పాడు. దీంతో సదరు ఎమ్ఎల్సీ సోదరులను అధికారులు బిల్డర్ ఫ్లాట్‌కు పిలిపించి విచారించారు. నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాలపై ఆరా తీశారని సమాచారం. అయితే రూ.40 కోట్ల నగదు లభ్యమైన తర్వాత.. ఆరుకు పైగా కార్లలో పదుల సంఖ్యలో అధికారుల సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేశారు. సోదాలు ముగిశాక బిల్డర్‌కు ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అందులో దొరికిన డబ్బు గురించి మరింత సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. నగదులో పాటు స్వాధీనం చేసుకున్న కొన్ని డాక్యుమెంట్లను తమతో పాటు తీసుకెళ్లారు.
మాజీ కార్పొరేటర్ బంధువు ఇంట్లో..
అంతకుముందు గురువారం బెంగళూరులో ఆదాయపు పన్నుశాఖ దాడులు చేపట్టింది. ఆర్‌టీ నగర్.. ఆత్మానంద కాలనీలో నివాసం ఉంటున్న ఓ బీబీఎంపీ మాజీ మహిళా కార్పొరేటర్ బంధువు ఇంట్లో రూ.42 కోట్లు దొరికినట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. గురువారం సాయంత్రం 6 గంటలకు పోలీసు సిబ్బందితో వచ్చిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు.. మాజీ కార్పొరేటర్ బంధువు ఇంట్లో తనిఖీలు నిర్వహించి పెట్టెల్లో ఉన్న డబ్బును స్వాధీనం చేసుకున్నారు. సర్జాపుర్ సమీపంలోని ముల్లూరు, ఆర్‌ఎంవీ ఎక్స్‌టెన్షన్, బీఈఎల్ సర్కిల్, మల్లేశ్వరం, డాలర్స్ కాలనీ, సదాశివనగర్, మట్టికేరి సహా పదికి పైగా చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.