తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Azadi Ka Amrit Mahotsav: రెండో ప్రపంచయుద్ధం వేళ.. క్రిప్స్​తో చర్చిల్​ దొంగాట

Azadi Ka Amrit Mahotsav: ఓడెక్కే దాకా ఓడ మల్లయ్య... దిగగానే బోడి మల్లయ్య తరహాలో సాగిన బ్రిటిష్‌ సర్కారు... భారత నేతలనేకాదు, తమ సొంత మంత్రులను కూడా వంచించింది. వారితోనూ దాగుడు మూతలాడింది. అందుకు ప్రత్యక్ష నిదర్శనం సర్‌ క్రిప్స్‌ రాయబారం!

Azadi Ka Amrit Mahtsav
క్రిప్స్‌తో చర్చిల్‌ దొంగాట

By

Published : Mar 24, 2022, 6:59 AM IST

Azadi Ka Amrit Mahotsav: రెండో ప్రపంచయుద్ధం ఆరంభమయ్యే సమయానికి భారత జాతీయోద్యమం కూడా కీలక దశకు చేరుకుంది. 1941లో యుద్ధ బరిలోకి దిగిన జపాన్‌... బ్రిటిష్‌ వ్యతిరేక కూటమిలో భాగమైంది. 1942 ఫిబ్రవరిలో సింగపూర్‌, మార్చిలో రంగూన్‌ జపాన్‌ చేతుల్లోకి వెళ్లాయి. ఇది భారత్‌లోని ఆంగ్లేయ సర్కారుకు వణుకు తెప్పించింది. ఆ సమయానికి యుద్ధంలో బ్రిటన్‌కు సహకరించేందుకు గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్‌ నేతలు సిద్ధంగా లేరు. కారణం- తమకు మాటమాత్రమైనా చెప్పకుండా భారత్‌ కూడా యుద్ధంలో భాగమే అంటూ వైస్రాయ్‌ లార్డ్‌ లిన్‌లిత్‌గో ఏకపక్షంగా ప్రకటించటమే. వైస్రాయ్‌ ప్రకటనకు నిరసనగా అన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రాజీనామా కూడా చేశాయి. జపాన్‌ దూకుడును అడ్డుకోవాలంటే భారత్‌లో కాంగ్రెస్‌ సాయం అవసరమని బ్రిటన్‌తో దాని మిత్రదేశాలు వాదించాయి.

యుద్ధం తర్వాత భారత్‌కు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలంటూ అమెరికా నుంచి ఒత్తిడి తీవ్రం అవటంతో బ్రిటన్‌ ప్రధాని చర్చిల్‌ అయిష్టంగానే కాంగ్రెస్‌ నేతలతో చర్చలకు అంగీకరించారు. 1942 మార్చి 11న బ్రిటన్‌ యుద్ధ కేబినెట్‌ సమావేశమై... భారత్‌లో కాంగ్రెస్‌ నేతలతో విభేదాలను పరిష్కరించుకోవాలని నిర్ణయించింది. అయితే ఇందుకు మార్గం స్వయంప్రతిపత్తి ఇవ్వటమేనని అంతా ఆంతరంగికంగా అంగీకరించారు. కానీ చర్చిల్‌ మాత్రం సుముఖత వ్యక్తంజేయలేదు. ‘బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని కుదించటం కోసమని నేనీ పదవిలో కూర్చోలేదు. నల్లజాతి వారికి స్వీయపాలన చేతకాదు’ అంటూ ఆక్రోశం వెళ్లగక్కాడు. కానీ తన కేబినెట్‌, మిత్రదేశాల ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు. భారత్‌కు ఓ ఉన్నతస్థాయి బృందాన్ని పంపటానికి చర్చిల్‌ సిద్ధమయ్యాడు.
మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 11 మధ్య తన కేబినెట్‌ సహచరుడు సర్‌ స్టాఫర్డ్‌ క్రిప్స్‌ భారత్‌లో పర్యటించి యుద్ధంలో భారత సహకారంతో పాటు... పాక్షిక అధికార మార్పిడిపై ముగ్గురికీ (హిందు, ముస్లిం, బ్రిటన్‌) ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తారని చర్చిల్‌ ప్రకటించాడు. యుద్ధానంతరం భారత్‌కు స్వయం ప్రతిపత్తి ఇవ్వటానికి అంగీకరిస్తూ ఓ అంగీకార పత్రాన్ని కూడా కేబినెట్‌ రూపొందించింది. ఈ పత్రాన్ని చూడగానే భారత్‌లో బ్రిటిష్‌ వైస్రాయ్‌ లిన్‌లిత్‌గో అగ్గిమీద గుగ్గిలమై రాజీనామాకు సిద్ధమయ్యాడు. కారణం- కాంగ్రెస్‌తో ఎలాంటి రాజీ అవసరం లేదనీ... భారత్‌పై బ్రిటన్‌ పట్టు కొనసాగించాలన్నది ఆయన వాదన. కానీ అప్పటికే క్రిప్స్‌ను పంపాలని నిర్ణయించటంతో ఏమీ చేయలేని పరిస్థితి.

సర్‌ క్రిప్స్‌ సామ్యవాది. యుద్ధ సమయంలో బ్రిటన్‌కు మిత్రదేశాల సాయంలో కీలక పాత్ర పోషించారు. క్లిష్ట సమస్యల పరిష్కారాల్లో దిట్టగా పేరొందారు. ఇప్పుడు భారత్‌లో సమస్యను కూడా తేల్చేస్తే... బ్రిటన్‌ తదుపరి ఎన్నికల్లో చర్చిల్‌కు పోటీదారుగా తయారయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నవాడు క్రిప్స్‌. అందుకే... క్రిప్స్‌ను పంపిస్తూనే, ఆయన ప్రయత్నాలు ఫలించకుండా తెరవెనక మంత్రాంగం కూడా మొదలెట్టాడు చర్చిల్‌. భారత్‌ పట్ల సానుకూల దృక్పథం, సానుభూతిగల క్రిప్స్‌ తన స్నేహితుడైన జవహర్‌లాల్‌ నెహ్రూ తదితరులతో చర్చలు జరిపారు. అదే సమయంలో ముస్లింలీగ్‌తోనూ సంప్రదింపులు జరిపారు. అప్పటికే ముస్లింలీగ్‌ ప్రత్యేక పాకిస్థాన్‌ డిమాండ్‌ మొదలెట్టింది. స్వయం ప్రతిపత్తిగల భారత్‌లో చేరటం తప్పనిసరేమీ కాబోదని ముస్లింలీగ్‌కు క్రిప్స్‌ హామీ ఇచ్చారు. అలా జిన్నాను ఒప్పించారు.

వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నేతలు తమ రాజీనామాలను వెనక్కి తీసుకొని మళ్లీ ప్రభుత్వాల్లో చేరటం; యుద్ధం కాగానే భారత్‌కు స్వయం ప్రతిపత్తి ఇవ్వటం ప్రధానాంశాలుగా కాంగ్రెస్‌తో క్రిప్స్‌ చర్చలు సాగాయి. వీటితో పాటు వైస్రాయ్‌ కనుసన్నల్లో కాంగ్రెస్‌ సారథ్యంలో కేంద్రంలో సమాఖ్య తరహా ప్రభుత్వం కూడా ఏర్పడేలా క్రిప్స్‌ యత్నించారు. వైస్రాయ్‌ పెద్దరికం ఉన్నా కేబినెట్‌ చేతుల్లో అధికారం ఉండేలా ఏర్పాట్లు చేసుకుందామని ప్రతిపాదించారు. కానీ వైస్రాయ్‌ లిన్‌లిత్‌గో ఈ ప్రతిపాదనలపై అసహనం వ్యక్తంజేశాడు. క్రిప్స్‌పై లండన్‌కు ఫిర్యాదు చేశాడు. చట్టబద్ధంగా వైస్రాయ్‌కి సంక్రమించిన అధికారాలను క్రిప్స్‌ ఉల్లంఘిస్తున్నారంటూ ఆరోపించి... ఆయన చెప్పినట్లు నడుచుకోవటం సాధ్యంకాదని తేల్చేశాడు. దీంతో చర్చల నుంచి కాంగ్రెస్‌ వెనక్కి తగ్గింది. క్విట్‌ ఇండియా ఉద్యమానికి సిద్ధమైంది. తన రాయబారం విఫలమై క్రిప్స్‌ అసంతృప్తితో లండన్‌ బయల్దేరాల్సి వచ్చింది. స్వదేశం చేరగానే క్రిప్స్‌పై చర్చిల్‌ విమర్శలు గుప్పించాడు. తన పరిధికి మించి వ్యవహరించారని ఆరోపించాడు. 1970లో బయటపడ్డ అధికారిక పత్రాలను చూస్తే... చర్చిల్‌, లిన్‌లిత్‌గోలు కలిసే క్రిప్స్‌ రాయబారాన్ని దెబ్బతీశారనే సంగతి బయటపడింది. ఇన్ని చేసినా యుద్ధానంతరం బ్రిటన్‌ ఎన్నికల్లో తన ఓటమిని, భారత్‌ స్వాతంత్య్రాన్ని చర్చిల్‌ ఆపలేకపోయాడు.

ఇదీ చదవండి:ఉరితో ఆగలేదు.. భగత్​సింగ్​ మృతదేహాన్ని ముక్కలు చేసి.. సంచిలో కుక్కి..

ABOUT THE AUTHOR

...view details