తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Azadi Ka Amrit Mahotsav: తుస్సుమన్న ఇర్విన్‌ పటాకా

ఎన్నో ఆశలతో ముట్టించిన చిచ్చుబుడ్డి వెలుగులు విరజిమ్మకుండా తుస్సుమంటే ఎంత నిరాశపడిపోతామో కదా! అమ్మినవారినెంత తిట్టుకుంటామో కదా? జాతీయోద్యమంలోనూ ఓ దీపావళికి ఇలాంటిదే చోటుచేసుకుంది. స్వయంగా వైస్రాయ్‌ చేసిన ‘దీపావళి డిక్లరేషన్‌’ తుస్సుమంది! భారతీయుల్లో ఆవేదన, ఆగ్రహం నింపి... సంపూర్ణ స్వరాజ్యం దిశగా అడుగులు వేయించింది.

azadi ka amrit mahotsav
తుస్సుమన్న ఇర్విన్‌ పటాకా

By

Published : Nov 3, 2021, 10:16 AM IST

పాలనా సంస్కరణలపై భారతీయులతో సంప్రదిస్తామని, వారికి భాగస్వామ్యం కల్పిస్తామని 1919నాటి గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా చట్టంలో చెప్పిన బ్రిటన్‌ ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేయలేదు. ఏకపక్ష నిర్ణయాలకే మొగ్గుచూపింది. 1927లో భారత్‌లో పాలన, రాజ్యాంగ సంస్కరణలపై సైమన్‌ కమిషన్‌ను నియమించింది. అందులో భారతీయులెవరికీ చోటు కల్పించలేదు. దీనిపై భారత్‌లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. అయినా బ్రిటన్‌ లొంగలేదు. పైగా దమ్ముంటే మీకు మీరుగా రాజ్యాంగం రాయగలరా? అంటూ సవాలు విసిరింది. దీంతో జాతీయోద్యమ నేతలు మోతీలాల్‌ నెహ్రూ సారథ్యంలో ఆయన కుమారుడు జవహర్‌లాల్‌ నెహ్రూ కార్యదర్శిగా ఓ రాజ్యాంగ ముసాయిదా నివేదిక తయారు చేశారు. ఇందులో భారత్‌కు స్వయం ప్రతిపత్తి (బ్రిటిష్‌ రాచరికానికి లోబడి ఉంటుంది. కానీ స్వయం పాలన. కెనడా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాల మాదిరి) ఇవ్వాలని ప్రతిపాదించారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, మహిళలకు సమాన హక్కులు కూడా ఉన్నాయి. 1927 డిసెంబరులో జరిగిన మద్రాసు కాంగ్రెస్‌ ప్లీనరీలో వీటిపై చర్చ జరిగింది. కానీ వీటిని జిన్నా తిరస్కరించారు.

నెహ్రూ నివేదిక అనంతరం... స్వయం ప్రతిపత్తి డిమాండ్‌ ఊపందుకోసాగింది. దీంతో 1929 అక్టోబరు 31న అప్పటి భారత వైస్రాయ్‌ లార్డ్‌ ఇర్విన్‌ కీలక ప్రకటన విడుదల చేశారు. సరిగ్గా దీపావళికి మూడురోజుల ముందు చేశారు కాబట్టి... దీన్ని ‘దీపావళి ప్రకటన’ అంటారు.

‘భారత్‌కు స్వయంప్రతిపత్తి హోదా ఇవ్వాలనేదే బ్రిటిష్‌ ప్రభుత్వ ఆకాంక్ష’ అంటూ... క్లుప్తంగా ముగించారు ఇర్విన్‌. ఎప్పుడిస్తారనే సంగతి అందులో లేదు. వైస్రాయ్‌ ప్రకటన అటు బ్రిటన్‌లో ఇటు భారత్‌లో రాజకీయ సెగ రగిలించింది. భారత్‌కు స్వయంప్రతిపత్తిపై బ్రిటన్‌ రాజకీయవర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. బ్రిటన్‌తో పాటు... అప్పటికే స్వయంప్రతిపత్తి హోదా అనుభవిస్తున్న కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ కూడా అడ్డుపడ్డాయి. తమతో సమానంగా శ్వేతేతర భారత్‌కు స్వయంప్రతిపత్తి హోదా కల్పించటానికి అభ్యంతరం వ్యక్తంజేశాయి. భారత్‌లోనేమో... ఇర్విన్‌ ప్రకటనను అంతా స్వాగతించారు. బ్రిటిష్‌ ప్రభుత్వంతో సహకరించేందుకు సిద్ధపడ్డారు. స్వయంప్రతిపత్తి, రాజ్యాంగ నిర్మాణంపై తక్షణమే ప్రభుత్వానికి, జాతీయోద్యమ నేతల మధ్య చర్చలు జరగాలన్నారు.

ఇంతలో... బ్రిటిష్‌ ప్రభుత్వం భారత్‌కు స్వయంప్రతిపత్తి హోదా ఇచ్చే ప్రతిపాదనేదీ లేదని స్పష్టం చేసింది. ఇర్విన్‌ కూడా ఇవ్వాలన్నది ఆకాంక్ష అని చెప్పానే తప్ప ఇస్తామని చెప్పలేదంటూ భారతీయుల ఆశలపై నీళ్లుజల్లారు. జాతీయోద్యమంలో విభేదాలు సృష్టించటానికే బ్రిటిష్‌ పాలకులు ఈ ఎత్తుగడ వేశారనేది తర్వాత తేలింది. దీపావళి ముందు ప్రకటన చేసి అందరిలో ఆశలు రేపిన ఇర్విన్‌ పటాకా అలా తుస్సుమనటంతో... అందరిలోనూ ఆగ్రహం వ్యక్తమైంది. కాంగ్రెస్‌ ఇక స్వయం ప్రతిపత్తి వద్దు... సంపూర్ణ స్వరాజ్యమే లక్ష్యమంటూ తీర్మానించింది.

ఇదీ చదవండి:'మనం మరణించాకే పిల్లలకు ఆస్తి ఇవ్వాలి'

ABOUT THE AUTHOR

...view details