Azadi Ka Amrit Mahotsav: ఊహ తెలిసిన నాటి నుంచీ 14 సంవత్సరాలు ఇంగ్లాండ్‌లో ఉండి... 1893లో భారత గడ్డపై ఓ విదేశీయుడిలా అడుగుపెట్టిన 21 సంవత్సరాల యువకుడు అరబిందో. తండ్రి డాక్టర్ కృష్ణధన్ ఘోష్ బంగాల్‌లో సర్జన్. తన పిల్లలను ఆంగ్లేయుల్లా పెంచాలనుకున్నారు. 1872 ఆగస్టు 15న జన్మించిన అరబిందోను తన ఏడో ఏటే చదువుల కోసం ఇంగ్లాండ్‌కు పంపించారు. అక్కడ ఆంగ్లేయులను మించి ఆంగ్లంతో పాటు గ్రీక్, లాటిన్, ఫ్రెంచ్, ఇటాలియన్ భాషలను, సాహిత్యాన్ని ఔపోసన పట్టేశారు అరబిందో. ఉద్యోగం కోసమని... ఇండియన్ సివిల్ సర్వీసెస్ (ఐసీఎస్) పరీక్ష రాశారు. 18 ఏళ్ల వయసులో తొలి యత్నంలోనే విజయం సాధించారు. ఆ రోజుల్లో ఐసీఎస్ కావాలంటే గుర్రపుస్వారీ పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించాల్సిందే. అదంటే ఇష్టం లేని అరబిందో ఎన్నిసార్లు పిలిచినా పరీక్షకు పోలేదు. ఫలితంగా... ఐసీఎస్ వదులుకోవాల్సి వచ్చింది.
Aurobindo ghosh: ఆక్స్‌ఫర్డ్‌లో చదివే సమయంలో అక్కడి భారతీయ విద్యార్థుల మజ్లిస్(చర్చావేదిక)లో భారత్‌లో పరిస్థితులను విన్న తర్వాత అరబిందోలో ఆలోచన మొదలైంది. వీటికి తోడు ఇంగ్లాండ్‌కు వ్యతిరేకంగా ఐర్లాండ్ విప్లవం ఆయనను ప్రభావితం చేసింది. బరోడా మహారాజు సయాజీరావు గైక్వాడ్ కోరిక మేరకు భారత్ వచ్చి బరోడా సంస్థానంలో ఉద్యోగంలో చేరారు. పుట్టినప్పటి నుంచీ విదేశీ ప్రభావంతో సాగిన ఆయనకు సంస్కృతం నేర్చుకున్నాక భారతీయాత్మతో పరిచయమైంది.
స్వస్థలం బంగాల్‌లోని రాజకీయ పరిస్థితులు ఆయనను కదిలించాయి. సాయుధ పోరాటమూ స్వరాజ్య సాధనకు మార్గమని నమ్మారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లోని భారతీయ సిపాయిలతో రహస్యంగా సమాలోచనలు జరిపారు. 1857 తరహా సిపాయిల తిరుగుబాటుకు యత్నించినా అది అమలు కాలేదు.
ఇదీ చూడండి:Azadi Ka Amrit Mahotsav: బయట ఆకలికేకలు.. దర్బార్‌లో రాచవిందులు
తమ్ముణ్ని సైతం తన బాటలో...
Aurbobindo vivekananda: 1899లో బంగాల్‌కు చెందిన జతీంద్రనాథ్ బెనర్జీని బరోడాకు రప్పించి సైనిక శిక్షణ ఇప్పించారు. బంగాల్‌లో సాయుధులను తయారు చేసే పని అప్పగించారు. ఇంగ్లాండ్ నుంచి వచ్చేసిన తన తమ్ముడు బరీంద్రను కూడా ఆ దిశగానే ప్రోత్సహించారు. దేశానికి శారీరకంగా, మానసికంగా దృఢమైన యువకులు కావాలన్న వివేకానందుడి ఆలోచనలతో స్ఫూర్తిపొంది... బంగాల్ అంతటా... వ్యాయామశాలలను ప్రోత్సహించారు. కోల్‌కతాలోని అరబిందో ఇల్లు విప్లవవాదులకు, బాంబుల తయారీకి కేంద్రంగా మారింది. అదే సమయంలో వెలిసిన విప్లవవాద అనుశీలన్ సమితి కలసి వచ్చింది. వివేకానందుడి శిష్యురాలు సిస్టర్ నివేదిత పరిచయంతో ఆయనలోని రాజకీయవాది పూర్తిగా మేల్కొన్నాడు. బంగాల్ విభజన (1905) తర్వాత కోల్‌కతాకు మకాం మార్చి పూర్తిగా జాతీయోద్యమంలో భాగమయ్యారు. అప్పటికి కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ ప్రభుత్వానికి పదేపదే విజ్ఞప్తులు చేసే పార్టీగా సాగుతోంది. స్వాతంత్య్రం విజ్ఞప్తులతో రాదని... సామాన్యులను భాగస్వాములను చేసి... విప్లవం తేవాలని బలంగా వాదించారు అరబిందో. తిలక్‌తో కలసి పనిచేశారు.
ఇదీ చూడండి:Azadi Ka Amrit Mahotsav: తుపాకులకు ఎదురొడ్డి.. స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటి..
అతివాదులు... మితవాదులు
Alipore bomb case: 1907 సూరత్ కాంగ్రెస్ మహాసభలో దీనిపై గొడవే జరిగింది. మితవాదులు, అతివాదులుగా కాంగ్రెస్ చీలిపోయింది. ఇంతలో... మేజిస్ట్రేట్‌పై దాడి కేసులో అరెస్టయిన ఖుదీరాం బోస్ ద్వారా బాంబుల ఆనుపానులు తెలియటంతో అరబిందో ఇంటిపై పడ్డారు పోలీసులు. 1908 అలిపుర్ బాంబుకేసులో అరబిందోను దోషిగా చేర్చి... అరెస్టు చేశారు. ఏడాది పాటు కిటికీ కూడా లేని కారాగారంలో కష్టాలు అనుభవించాక ఆయన్ను విడుదల చేశారు. జైలులో ఉన్న తరుణంలోనే ఆయన ఆధ్యాత్మికత వైపు మళ్లారు. బయటకు వచ్చాక కొద్ది రోజులు జాతీయోద్యమ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ప్రసంగాలతో ప్రజల్లో ప్రభుత్వంపై విద్వేషం పెంచుతున్నాడనే ఆరోపణలతో 1910 జనవరిలో అరబిందోపై అరెస్టు వారెంట్ జారీ అయింది. దీంతో ఆయన ఓ రోజు రాత్రి కోల్‌కతా నుంచి ఫ్రెంచ్ పాలనలోని చందర్‌నగర్‌కు... అక్కడి నుంచి పాండిచ్చేరికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆధ్యాత్మిక బాటలో పయనించిన ఆయన 1950 డిసెంబరు 5న దేహాన్ని విడిచినా నేటికీ ఆరని దివ్యజ్యోతిలా వెలుగొందుతున్నారు.
ఇవీ చూడండి: