మహారాష్ట్రలోని నాశిక్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి పామును ముద్దాడేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. సిన్నర్ తాలుకాలోని నాగేశ్ భలేరో అనే ఓ స్నేక్ క్యాచర్.. తాను పట్టిన ఓ పామును ముద్దాడేందుకు ప్రయత్నించగా పెదవిపై కాటు వేసింది.
వివరాల్లోకి వెళ్తే.. నాశిక్ సిన్నర్‌కు చెందిన నాగేశ్ అనే పాముల సంరక్షుడు శుక్రవారం ఓ పామును పట్టుకున్నాడు. అనంతరం ఆ పామును తీసుకుని తన స్నేహితుని కేఫ్ వద్దకు వెళ్లాడు. ఆ తర్వాత మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఆ పామును మేడపైకి తీసుకెళ్లి దానితో విన్యాసాలు చేశాడు. ఈ క్రమంలోనే పామును ముద్దాడేందుకు ప్రయత్నించగా.. నాగేశ్ పెదవిపై కాటు వేసింది. దీంతో అప్రమత్తమైన స్నేహితులు అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ మరణించాడు.