Attack on dalits Bihar: పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన కోపంలో సామాజిక దురహంకారం ప్రదర్శించాడు ఓ అభ్యర్థి. కండకావరంతో దళితులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అంతేగాక, ఉమ్మిని నాకాలని ఒకరిని బలవంతం చేశాడు. ఈ అమానుష ఘటన బిహార్ ఔరంగాబాద్ జిల్లాలో జరిగింది.
Bihar panchayat candidate attacks dalit
అంబ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుమ్రి పంచాయతీకి పోటీ చేశాడు నిందితుడు బల్వంత్ సింగ్. ఎన్నికల్లో కంగుతిన్న ఆ వ్యక్తి.. తన ఓటమికి దళితులే కారణమంటూ దాడికి పాల్పడ్డాడు. దాడికి ముందు ఇద్దరు దళితులను గుంజీలు తీయించాడు.
బల్వంత్ దాడి చేయడాన్ని స్థానికులు వీడియో తీశారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇద్దరు ఓటర్లకు డబ్బులు ఇచ్చినా.. వారు తనకు ఓటేయలేదని బల్వంత్ ఆరోపించడం వీడియోలో వినిపిస్తోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చర్యలు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా మేజిస్ట్రేట్ సౌరబ్ జోర్వాల్, ఎస్పీ కాంతేశ్ కుమార్ మిశ్ర.. విచారణకు ఆదేశించారు.
అయితే, మద్యం మత్తులో ఉన్న గ్రామస్థులు గొడవ చేశారని, వారిని వారించి పక్కకు మాత్రమే తోసేశానని బల్వంత్.. పోలీసులకు వివరణ ఇచ్చాడు. మత్తు దిగిన తర్వాత వారే తనపై కేసు పెట్టారని అన్నారు.
ఇదీ చదవండి:ప్రియుడి కోసం యువతి గ్యాంగ్ రేప్ నాటకం