Atchannaidu About TDP Janasena Meeting:విజయవాడలో తెలుగుదేశం-జనసేన సమన్వయ కమిటీ రెండో సమావేశం నిర్వహించింది. రెండో సమావేశానికి టీడీపీ తరఫున.. నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్యగా హాజరయ్యారు. మరో వైపు జనసేన తరఫున... నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, బొమ్మిడి నాయికర్, పాలవలస యశస్వి, మహేందర్ రెడ్డి, కొటికలపూడి గోవిందరావు తదితర నేతలు పాల్గొన్నారు. నేటి సమావేశంలో ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన, 100 రోజుల ప్రణాళిక, ఓటరు జాబితా అవకతవకలపై ఇరు పార్టీల నేతలు సుదీర్ఘంగా చర్చించారు.
'పార్టీకి అందరూ సమయం కేటాయించాలి... జూలైలో ప్లీనరీ నిర్వహించుకుందాం'
175 నియోజకవర్గాల్లో 3 రోజులు: విజయవాడలో తెలుగుదేశం-జనసేన సమన్వయ కమిటీ రెండో సమావేశం జరిగింది. సమావేశం అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. 175 నియోజకవర్గాల్లో 3 రోజులు చొప్పున టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆయా నియోజకవర్గాల వారీగా ప్రణాళికల తయారీ కోసం నిర్ణయాలు తీసుకున్నట్లు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఏ నియోజకవర్గంలో ఎప్పుడు కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై ఒకట్రెండు రోజుల్లో వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. ఇప్పటికే భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ఇంటింటికెళ్తున్నట్లు అచ్చెన్న పేర్కొన్నారు.
17 నుంచి భవిష్యత్తుకు గ్యారెంటీ:పార్టీకి ముగ్గురి చొప్పున మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు అచ్చెన్న తెలిపారు. టీడీపీ నుంచి యనమల నాయకత్వంలో ముగ్గురు సభ్యులు ఉంటారని పేర్కొన్నారు. ఈనెల 13న మొదటి సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చించనున్నట్లు అచ్చెన్న వెల్లడించారు. జనసేన ఇచ్చిన ఐదారు పాయింట్లను కూడా పరిగణలోకి తీసుకునున్నట్లు తెలిపారు. ఈనెల 17 నుంచి తెలుగుదేశం-జనసేన కలిసి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.