పార్లమెంటు తదుపరి సమావేశాలపై శాసనసభ ఎన్నికలు ప్రభావం చూపనున్నాయి. కేంద్ర బడ్జెట్, ద్రవ్య వినిమయ బిల్లులపై చర్చించేందుకు మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకూ పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు నిర్వహించనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరితో పాటు బంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రాంతాల ఎంపీలంతా ఏప్రిల్ 6 వరకూ ఎన్నికల ప్రచారంలో నిమగ్నం కానున్నారు. నిజానికి కేంద్రంలో విపక్షాల బలం అంతంత మాత్రమే. అయితే వివిధ బిల్లులపై లోతుగా మాట్లాడి, ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసే విపక్ష ఎంపీల్లో ఎక్కువమంది ప్రస్తుతం ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు చెందినవారే కావడం గమనార్హం. సొంత రాష్ట్రాల్లో తమ పార్టీల విజయానికి కృషి చేయాల్సి ఉండటం వల్ల ఈ దఫా సమావేశాలకు వారు హాజరుకావడం అనుమానమే.
విపక్ష గళం బలహీనం..
పార్లమెంటులో 37 పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది. కానీ.. వివిధ సమస్యలపైనా, ప్రభుత్వ విధానాలపైనా బలంగా గళం విప్పేది మాత్రం కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్, సీపీఎం, సీపీఐ, ఆర్‌ఎస్పీ సభ్యులే! వీరిలో అత్యధికులు బంగాల్, తమిళనాడు, కేరళ నుంచి ఎన్నికైనవారే. పుదుచ్చేరి (ఒక లోక్‌సభ స్థానం)తో పాటు బంగాల్ (42), తమిళనాడు (39), కేరళ (20), అసోం (14) రాష్ట్రాల్లో మొత్తం 116 లోక్‌సభ స్థానాలున్నాయి. ఇందులో అధికార భాజపాకు 27 మంది ఎంపీలు, దాని మిత్రపక్షం అన్నాడీఎంకేకు ఒక్క ఎంపీ ఉన్నారు. మిగతా 88 మంది ప్రతిపక్ష సభ్యులే. ఇందులో కాంగ్రెస్‌కు రాహుల్‌గాంధీ సహా 28, డీఎంకేకు 24, తృణమూల్ కాంగ్రెస్‌కు 22 (ఒకరు పార్టీకి రాజీనామా చేశారు) మంది ఎంపీలు ఉన్నారు. సీపీఎంకు ముగ్గురు, సీపీఐ, ఐయూఎంఎల్‌కు ఇద్దరు చొప్పున ఆర్‌ఎస్పీ, కేరళ కాంగ్రెస్ (ఎం), ఏఐయూడీఎఫ్, వీసీకేలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులున్నారు. మరొకరు స్వతంత్ర అభ్యర్థి కాగా.. కేరళ, తమిళనాడుల్లో ఒక్కో స్థానం ఖాళీగా ఉన్నాయి.