అసోంలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. రూ.12.96 కోట్ల రూపాయల విలువైన 2.59 లక్షల 'యాబా' టాబ్లెట్‌లుగా పిలిచే ఈ మాదకద్రవ్యాలను కరీంగంజ్ అనే ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు. ఘటన స్థలం నుంచి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అసోం పోలీసులు, సరిహద్దు దళం(బీఎస్ఎఫ్) సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి.
'యాబా' అనేది మెథాంఫేటమిన్ అనే రసాయనంతో తయారయ్యే పదార్థం. శక్తిమంతమైన ఈ డ్రగ్ తీసుకున్నవారు దీనికి వ్యసనంగా మారుతారని పోలీసులు తెలిపారు. తూర్పు ఆసియాలో ఈ ఔషధం పెద్దఎత్తున ఉత్పత్తి అవుతోంది. అమెరికాలో స్థిరపడిన ఆసియా వాసుల్లో కొందరు తమ రేవ్ పార్టీల్లో దీనిని ఎక్కువగా వినియోగిస్తుంటారని వివరించారు.
425 కిలోల గంజాయి..
ఝార్ఖండ్ తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలో 425 కిలోల గంజాయితో పాటు.. ముగ్గురు వ్యక్తులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, పోలీసు సిబ్బంది అరెస్టు చేశారు. వాహనాల తనిఖీలు చేస్తుండగా అనుమానంగా ఎదురుపడిన వీరిని అరెస్టు చేయగా గంజాయి అక్రమరవాణా విషయం వెలుగుచూసినట్లు పోలీసులు తెలిపారు.