Assam CM remarks on Rahul: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న వేళ అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. సైనిక సిబ్బంది గురించి ప్రశ్నించడాన్ని తాను ఏమాత్రం సహించబోనంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్, సీడీఎస్ బిపిన్ రావత్‌ను ఉద్దేశించి గతంలో కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలతో కూడిన వార్తా క్లిప్పింగులను ట్విట్టర్‌లో షేర్ చేశారు హిమంత.
Assam CM Rahul Gandhi:
"సైన్యం వైపు నిలబడడమే నేరమా? అయినా, ఆర్మీ సిబ్బంది దేశభక్తిని శంకించడానికి వీల్లేదు. దేశం కోసం వారు చేసే సేవల గురించి రుజువులు అడగడం సమంజసం కాదు. అయినా దేశం రాష్ట్రాల సమాఖ్య మాత్రమే కాదు.. భారత్ మన అమ్మ. మన జవాన్లను తప్పుబట్టడం అంటే.. మన అమ్మను మనం అవమానించినట్లే"
-హిమంత బిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి
బిపిన్ రావత్‌ను అవమానించడానికి, కించపరచడానికి ఉన్న ఏ అవకాశాన్ని కూడా కాంగ్రెస్ విడిచిపెట్టలేదని హిమంత ఆరోపించారు. ఆయన సీడీఎస్‌గా నియమితులైనప్పుడు కూడా ఆయనకున్న అర్హతలేంటంటూ ఆ పార్టీ ప్రశ్నించిందని చెప్పారు. సైనికుల తరఫున అలా మాట్లాడడంపై ప్రశ్నించినందుకు ఇవాళ వారు తనపై కోపంగా ఉన్నారంటూ హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు.
తీవ్ర వ్యాఖ్యలు..
ఇటీవల ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీపై హిమంత బిశ్వ శర్మ విరుచుకుపడ్డారు. సర్జికల్ స్ట్రైక్స్ గురించి రాహుల్ ప్రశ్నించడాన్ని తప్పుబట్టారు. ఈ క్రమంలో రాహుల్ పుట్టుక గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై తామేమైనా రుజువులు అడిగామా అని ఎదురు ప్రశ్నించారు. దీనిపై అటు కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీ నేత సైతం హిమంత వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆయనను బర్తరఫ్ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ యూత్ సభ్యులు హిమంతకు వ్యతిరేకంగా దిల్లీలో ఆందోళన నిర్వహించారు. అసోంలో పలు చోట్ల నిరసన కార్యక్రమాలు జరిపారు.
ఇదీ చదవండి:రెండో దశకు యూపీ సిద్ధం- ముస్లింలు, రైతుల ఓట్లే కీలకం!