తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లఖింపుర్ హింస కేసులో పోలీసుల ముందుకు ఆశిష్​ మిశ్రా - lakhimpur kheri incident

లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్​ మిశ్రా.. పోలీసుల ముందు శనివారం హాజరయ్యారు. విచారణకు ఆశిష్‌ మిశ్రా పూర్తిగా సహకరిస్తారని అతని న్యాయసలహాదారు స్పష్టం చేశారు.

ashish mishra
ఆశిష్​ మిశ్రా

By

Published : Oct 9, 2021, 10:58 AM IST

Updated : Oct 9, 2021, 11:50 AM IST

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో జరిగిన హింసాత్మక ఘటనకు ప్రధాన కారకుడిగా భావిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా ఎట్టకేలకు బయటకొచ్చారు. ఘటన జరిగిన అనంతరం కన్పించకుండా పోయిన ఆయన.. విచారణ నిమిత్తం శనివారం ఉదయం పోలీసుల ఎదుట హాజరయ్యారు.

లఖింపుర్‌ ఘటనలో విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆశిష్‌కు సమన్లు జారీ చేశారు. శుక్రవారమే హాజరవ్వాలని ఆదేశించినప్పటికీ ఆయన రాలేదు. ఈ క్రమంలోనే ఆయన నేపాల్‌ పారిపోయినట్లు కథనాలు కూడా వినిపించాయి. అయితే ఈ వార్తలను ఆశిష్‌ తండ్రి అజయ్‌ మిశ్రా ఖండించారు. తన కుమారుడు అమాయకుడని, అనారోగ్య కారణాలతో విచారణకు హాజరుకాలేదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం విచారణకు హాజరు కావాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తూ నిన్న పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. దీంతో ఆశిష్‌ నేడు లఖింపుర్‌లోని క్రైమ్‌ బ్రాంచ్‌ ఆఫీస్‌కు వచ్చారు. విచారణ ప్రారంభమైందని సిట్ డీఐజీ తెలిపారు.

మరోవైపు.. పోలీసుల విచారణకు ఆశిష్‌ మిశ్రా పూర్తిగా సహకరిస్తారని అతని న్యాయసలహాదారు అవదేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

భారీ భద్రత, ఇంటర్నెట్‌ బంద్‌..

ఆశిష్‌ మిశ్రాను పోలీసులు విచారిస్తున్న నేపథ్యంలో క్రైమ్‌ బ్రాంచ్‌ పరిసర ప్రాంతాలు, లఖింపుర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. లఖింపుర్‌లో గత ఆదివారం ఆందోళన చేస్తున్న రైతులపైకి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా కారు, మరో వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించగా, అనంతరం జరిగిన అన్నదాతల దాడిలో మరో నలుగురు చనిపోయారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. దీంతో ఆశిష్‌ సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవీ చూడండి:

Lakhimpur Incident: కేంద్ర మంత్రి డ్రైవర్​ కుటుంబానికి రూ.45లక్షలు

Navjot Singh Sidhu News: లఖింపుర్ ఖేరిలో సిద్ధూ నిరాహార దీక్ష

Last Updated : Oct 9, 2021, 11:50 AM IST

ABOUT THE AUTHOR

...view details