Forbes India W Power 2021: ఫోర్బ్స్ ప్రచురించిన దేశంలోని అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో ఒడిశాకు చెందిన మతిల్దా కుల్లూకు చోటు దక్కింది. ఎస్బీఐ మాజీ జనరల్ మేనేజర్ అరుంధతి భట్టాచార్య, బాలీవుడ్ నటి సన్యా మల్హోత్రాకు స్థానం లభించిన జాబితాలో.. ఓ సాధారణ మహిళకు చోటు దక్కడం విశేషం. కార్పొరేట్ ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేని మతిల్దా ఓ సామాన్య ఆశావర్కర్.
గిరిజనులు ఎక్కువగా ఉండే సుందర్‌గఢ్ జిల్లాలోని గర్‌గండ్‌బహల్ గ్రామానికి చెందిన 45 ఏళ్ల మతిల్దా.. అక్కడే 15 ఏళ్లుగా ఆశావర్కర్‌గా పనిచేస్తున్నారు. తన ప్రాంతంలో మూఢ నమ్మకాలు, కరోనాపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించారు. ఉదయం 5 గంటలకే దినచర్య ప్రారంభించే మతిల్దా సైకిల్‌పై గ్రామంలోని ప్రతి ఇల్లు తిరుగుతూ గ్రామస్థులను కలుస్తారు. ఆదివాసీ మహిళ అయినందున అంటరానితనం, చిన్నచూపు వంటి సవాళ్లను ఎదుర్కొన్న మతిల్దా వాటన్నింటినీ అధిగమించారు. కరోనా సమయంలో పరీక్షలు చేయించుకోవడానికి ప్రజలు సిగ్గుపడేవారని.. వారిని ఒప్పించడం తలకు మించిన పనైందని ఆమె గుర్తు చేసుకున్నారు. గ్రామంలోని ప్రజలందరికీ టీకాలు వేశానని మతిల్దా వెల్లడించారు. ఈ విధి నిర్వహణే మతిల్దాకు ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటు దక్కేలా చేసింది.