Bipin Rawat passed away: తమిళనాడు, కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 2015లో ఇటువంటి హెలికాప్టర్ ప్రమాదమే బిపిన్ రావత్‌కు ఎదురయింది. బిపిన్ రావత్ లెఫ్టినెంట్ జనరల్‌గా (6ఏళ్ల క్రితం) ఉన్న సమయంలో నాగాలాండ్‌లో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ప్రాణాలతో బయటపడ్డారు. అప్పుడు మృత్యువును జయించిన బిపిన్ రావత్.. మరోసారి హెలికాప్టర్ ప్రమాద రూపంలో వచ్చిన మృత్యువు ముందు తలవంచాల్సి వచ్చింది.
సాంకేతిక లోపంతో..
లెఫ్టినెంట్ జనరల్‌గా ఉన్న సమయంలో బిపిన్ రావత్.. 2015 ఫిబ్రవరి 3న నాగాలాండ్ దిమాపుర్ జిల్లాలోని హెలిప్యాడ్ నుంచి బయలుదేరారు. చీతా హెలికాప్టర్‌లో ఆయనతో పాటు మరో ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉన్నారు. హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లకే అందులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో బయలుదేరిన కొద్ది ఎత్తుకు వెళ్లగానే హెలికాప్టర్ కుప్పకూలింది. ఆ ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా దెబ్బతింది. అయినప్పటికీ బిపిన్ రావత్‌తోపాటు సిబ్బంది మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు.