Aravana Prasadam Sabarimala :శబరిమల అయ్యప్ప స్వామి 'అరవణ' ప్రసాదంపై ఆంక్షలు విధించింది ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు! ప్రసాదం డబ్బాల కొరత నేపథ్యంలో ఒక భక్తుడికి కేవలం 2 టిన్లే అందిస్తామని దేవస్థానం బోర్డు పేర్కొంది. కొద్ది రోజుల నుంచి ప్రసాదం కొరత కారణంగా ఒక్కో భక్తుడికి 10 టిన్లు మాత్రమే అందించేది దేవస్థానం. అయితే మకరజ్యోతి దర్శనానికి ఎక్కువ మంది భక్తులు రానున్న నేపథ్యంలో అరవణ ప్రసాదంపై పరిమితులు విధించింది దేవస్థానం బోర్డు.
ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయంతో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ప్రసాదం విషయంలో కొత్త ఆంక్షల నేపథ్యంలో స్వల్ప వివాదాలు జరుగుతున్నాయి. ఒక్కొక్కరికి రెండు టిన్నుల అవరణ ప్రసాదం ఇస్తామని నిబంధన పెట్టడం వల్ల క్యూలో భారీగా భక్తులు నిల్చొంటున్నారు.
'డబ్బాల కొరత వల్లే ఈ నిర్ణయం'
అయ్యప్ప ప్రసాదాన్ని నింపేందుకు డబ్బాల కొరత వల్ల ఒక్కో భక్తుడికి రెండు డబ్బాల ప్రసాదాన్ని ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని ట్రావెన్‌కోర్ దేవస్థానం అధికారులు తెలిపారు. త్వరలోనే అరవణ ప్రసాదం డబ్బాల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. గతేడాది 26వ తేదీన 2 కొత్త కంపెనీలకు ప్రసాదం డబ్బాల కాంట్రాక్ట్‌ను ఇచ్చింది దేవస్థానం బోర్డు. అయితే అంత మొత్తంలో కంపెనీలో అరవణ ప్రసాదం డబ్బాలను అందించలేకపోయాయి.