Anupriya Patel Exclusive: ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో మరోసారి భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అప్నాదళ్ అధ్యక్షురాలు, కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్. అప్నాదళ్‌కు ప్రజల ఆశీర్వాదం ఉందని ఆమె అన్నారు. రాష్ట్రంలో ఐదేళ్లుగా అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారని, మళ్లీ తమనే గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
భాజపా, అప్నాదళ్, నిషాద్ పార్టీ నేతలు కలిసి త్వరలోనే ప్రచారం నిర్వహించనున్నట్లు అనుప్రియా స్పష్టం చేశారు. సీట్ల పంపకం పూర్తి కాలేదని, కొద్దిరోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం.. రైతుల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చిందని తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో కోట్ల మంది రైతులకు ప్రయోజనాలు దక్కుతున్నాయన్న ఆమె.. వారు తమ వెంటే ఉన్నట్లు వివరించారు.
తన తండ్రి, అప్నాదళ్ స్థాపకుడు సోనే లాల్ పటేల్ సిద్ధాంతాలను పాటిస్తూ.. పార్టీని నడిపిస్తున్నానని ఆమె అన్నారు.