Antonio Guterres India UNSC Permanent Seat :బహుపాక్షిక వ్యవస్థలో భారత్‌ను చాలా ముఖ్యమైన భాగస్వామిగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అభివర్ణించారు. భారత్‌ను 'విశ్వ దేశం'గా ఆయన పేర్కొన్నారు. ఐరాస భద్రతా మండలిలో భారత్ సభ్యత్వంపైనా స్పందించారు. ఈ విషయంలో నిర్ణయం తమ చేతుల్లో ఏమీలేదని.. సభ్యదేశాలే తుది నిర్ణయం తీసుకుంటాయన్నారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు దిల్లీ చేరుకున్న గుటెరస్.. ఐరాస భద్రతా మండలిలో భారత్ చేరేందుకు సమయం ఆసన్నమైందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు.
'భారత్.. విశ్వదేశమని చెప్పడంలో అతిశయోక్తి లేదు'
Antonio Guterres India Visit :"ఐరాస భద్రతా మండలిలో ఎవరు ఉండాలన్నది నా నిర్ణయం కాదు. సభ్యదేశాలే దానిపై నిర్ణయం తీసుకుంటాయి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న భారత్.. విశ్వదేశమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బహుపాక్షిక వ్యవస్థలో భారత్ అతిముఖ్యమైన భాగస్వామి. నేటి ప్రపంచంలో బహుపాక్షిక వ్యవస్థను ప్రతిబింబించేలా సంస్కరణలు అవసరమని విశ్వసిస్తున్నా" అని ఐరాస చీఫ్ ఆంటోనియా గుటెరస్‌పేర్కొన్నారు. అయితే, ఈ సంస్కరణలకు ఏమైనా కాలక్రమం ఉందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. వాటిని చేయాల్సిన తక్షణ అవసరం ఉందన్నారు.
'ఒక కుటుంబం, ఒక భూమి, ఒక భవిష్యత్తు అనే నినాదం..'
జీ20 శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహించడం ప్రపంచానికి ఎంతో అవసరమైన పరివర్తనాత్మక మార్పునకు దారితీస్తుందని గుటెరస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక కుటుంబం, ఒక భూమి, ఒక భవిష్యత్తు అనే నినాదం మహా ఉపనిషత్తు నుంచి ప్రేరణ పొందిందని ఆయన గుర్తు చేశారు. జీ20 దేశాలు వాతావరణం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని సాధించడంలో నాయకత్వాన్ని ప్రదర్శించాలని గుటెరస్ అన్నారు. 80 శాతం ప్రపంచ ఉద్గారాలకు జీ20 దేశాలే కారణమవుతున్నందున.. వాటిని తగ్గించడంలో ముందుండాలని సూచించారు.