నేటి నుంచి నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించిన సామాజిక కార్యకర్త అన్నా హజారే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. దీక్ష రద్దు చేసుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించారు.
అంతకుముందు భాజపా సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్, కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి.. హజారేతో సమావేశమయ్యారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వారి సమక్షంలోనే హజారే ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తన డిమాండ్లలో కొన్నింటిని కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందన్నారు. అలాగే, రైతుల జీవితాలను మెరుగుపరిచేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించిందన్నారు.
''నా డిమాండ్లలో కొన్నింటిని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. రైతుల ప్రయోజనాల కోసం.. ఒక కమిటీని నియమించనున్నట్లు ప్రకటించింది. శనివారం నుంచి ప్రారంభించాలనుకున్న నిరాహార దీక్షను రద్దు చేసుకుంటున్నా.''