Ankita Bhandari murder: ఉత్తరాఖండ్‌లో 19 ఏళ్ల రిసెప్షనిస్ట్ హత్య కేసు తీవ్ర కలకలం సృష్టిస్తోంది. భాజపా నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్యకు చెందిన వనతార రిస్టార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేసే అంకితా భండారీ వారం క్రితం హత్యకు గురవ్వగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ హత్య కేసులో.. పుల్కిత్ ఆర్యను సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయగా.. వారు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అంకితను కాలువలోకి తోసి హత్య చేసినట్లు నిందితులు తెలిపారని వివరించారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో రిషికేశ్‌లోని చిల్లా కాలువలో.. అంకితా భండారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తరాఖండ్ విపత్తు ప్రతిస్పందన దళం తెలిపింది. ఆ మృత దేహం అంకితదేనని.. బంధువులు గుర్తించారు.
అసలేం జరిగింది:
హరిద్వార్‌కు చెందిన భాజపా నేత వినోద్ ఆర్య తనయుడు పుల్కిత్ ఆర్య యమకేశ్వర్‌లో వనతార రిసార్ట్‌ను నడుపుతున్నాడు. రిసార్ట్‌లో పౌరి జిల్లా శ్రీకోట్ గ్రామానికి చెందిన అంకితా భండారీ అనే 19 ఏళ్ల యువతి రిసెప్షనిస్ట్‌గా పని చేస్తుండేది. సెప్టంబర్ 19న ఆమె ఇంటికి రాలేదని అంకిత తండ్రి ఉదయపుర్ తల్లాలోని రాజస్వ చౌకీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్యతో పాటు రిసార్ట్ మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తా ఉన్నారు. మొదట కేసు విషయంలో పోలీసులను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించిన నిందితులు.. పోలీసులు తమశైలిలో ప్రశ్నించేసరికి నిజాన్ని చెప్పేశారు.
అంకితా భండారీని ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్లి మద్యం తాగించినట్లు నిందితులు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న అంకితను హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేశామని చెప్పారు. అంకితతో విభేదాలు రావడం వల్ల ఆమెను హత్య చేసినట్ల విచారణలో ఒప్పుకున్నారు. కాలువలో యువతి మృతదేహాన్ని గాలించేందుకు పోలీసులు ఓ టీమ్‌ను పంపించారు. అంకిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు ఆ మృతదేహం అంకితదే అని ధ్రువీకరించారు. కోటద్వార్ పోలీసులు ముగ్గురు నిందితులను విచారించి, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పౌరి జిల్లా జైలుకు తరలించారు.
ఆ సేవలు నిరాకరించిందనే..
అంకితా భండారీ స్నేహితులను పోలీసులు విచారించగా వారు సంచలన విషయాలను బయటపెట్టారు. రిసార్ట్ యజమానితో పాటు కొంతమంది ఉద్యోగులు ఆమెను అతిథులకు 'ప్రత్యేక సేవలు' అందించమని కోరేవారని దానికి ఆమె నిరాకరించడం వల్ల వేధింపులకు గురిచేసేవారని వివరించారు. మరోవైపు, అంకిత వాట్సాప్ చాట్ ద్వారా చాలా విషయాలు వెల్లడయ్యాయని పోలీసులు తెలిపారు.
ఆరోజు జరిగిందిదే..
వనతార రిసార్ట్ ఉద్యోగి తెలిపిన వివరాల ప్రకారం..సెప్టెంబర్ 18న సాయంత్రం 6 గంటల సమయంలో పులకిత్.. అంకిత గదిలోకి వెళ్లాడు. ఆ సమయంలో అంకిత ఏడుస్తూ సహాయం కోసం అరిచింది. కాసేపటికి పులకిత్తో పాటు మరో ఇద్దరు బైక్‌లో ఆమెను రిషికేశ్కు తీసుకెళ్లారు. తిరిగి వచ్చే సరికి అంకిత వారితో లేదని తెలిపారు. యువతి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను అరెస్టు చేశారు.