హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తాను మహారాష్ట్ర అమరావతి ఎంపీ నవనీత్‌కౌర్ కుల ధ్రువీకరణ పత్రాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది. రెండు లక్షల రూపాయల జరిమానా విధించింది. నవనీత్ కౌర్ తప్పుడు పత్రం సమర్పించారంటూ శివసేన చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.
"షెడ్యూల్డ్ కుల ధ్రువీకరణ పత్రం పొందటానికి నవనీత్ కౌర్ 'మోచి' అనే సామాజిక వర్గానికి చెందిని వారిగా తన వాదన వినిపించారు. దీన్ని కోర్టు విశ్వసించడం లేదు. ఆ వాదన మోసపూరితమైంది. రిజర్వుడు నియోజకవర్గంలో అభ్యర్థిగా పోటీ చేసి అన్య ప్రయోజనాలను పొందాలనే ఉద్దేశంతో చేసినట్లు కమిటీ విచారణలో తేలింది. దీంతో ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తున్నాం."
- బాంబే హైకోర్టు
అమరావతి ఎస్సీ రిజర్వ్ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికైన నవనీత్ కౌర్ కుల ధ్రువీకరణ రద్దుతో ఆమె పదవి పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానని నవనీత్ కౌర్ తెలిపారు.
"నా కుల ధ్రువీకరణ పత్రం అంశంపై తొమ్మిదేళ్లుగా పోరాటం చేస్తున్నాను. ఇందుకు సంబంధించిన కమిటీ మొదటిసారి నా కుల ధ్రువీకరణ పత్రానికి గుర్తింపు ఇచ్చిన తర్వాత ఈ అంశం హైకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఏర్పాటైన కమిటీ హైకోర్టు ఆదేశాల తర్వాత మళ్లీ హోం శాఖ విజిలెన్స్ ద్వారా నిర్ధారించుకుని కుల ధ్రువీకరణ పత్రం, దానికి గుర్తింపు ఇచ్చింది. దీని ఆధారంగానే నేను ఎన్నికల్లో పోటీ చేశాను. నాపై పోటీ చేసి ఓడిపోయిన వ‌్యక్తి ఓటమి తర్వాత ఈ అంశాన్ని మళ్లీ హైకోర్టులో అప్పీల్ చేశారు. 9ఏళ్లుగా నేను పోరాటం చేస్తున్న అంశంపై హఠాత్తుగా నిర్ణయం రావడం నాకు ఊహించని విషయం. దీనిపై నేను సుప్రీంకోర్టుకు వెళతాను."
- నవనీత్ కౌర్, ఎంపీ
ఇదీ చూడండి:మోదీతో మహారాష్ట్ర సీఎం ఠాక్రే భేటీ