fastest road construction: ప్రపంచ రికార్డ్ సృష్టించటమే లక్ష్యంగా మహారాష్ట్రలోని అమరావతి-అకోలా జాతీయ రహదారి నిర్మాణ పనులు సాగుతున్నాయి. 75 కిలోమీటర్ల మేర రహదారిని కేవలం 110 గంటల్లో నిర్మించి గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఈ పనులు శుక్రవారం(జూన్ 3) ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. జూన్ 7న సాయంత్రంలోపు పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనుకున్న సమయానికి పూర్తయితే.. గిన్నిస్ రికార్డులో చోటు లభించనుంది.
గత 10 ఏళ్లుగా అమరావతి- అకోలా రహదారి గుంతలమయంగా మారి అధ్వాన స్థితిలో ఉండేది. గతంలో ఈ రోడ్డు నిర్మాణ పనులను మూడు సంస్థలకు అప్పగించారు. కానీ, పనులు చేయటంలో జాప్యం చేశారు కాంట్రాక్టర్లు. దీంతో ప్రజలు అమరావతి నుంచి అకోలా చేరుకునేందుకు దర్యాపుర్ రహదారిని వినియోగించేవారు.
అమరావతి-అకోలా దారిలో ప్రయాణించటం చాలా ఇబ్బందితో కూడుకున్న పని. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత దారుణ రహదారిగా పేరు గాంచిన ఈ దారి ఇప్పుడు రికార్డ్ సృష్టించబోతోంది. ఈ రోడ్డు పనులను నాలుగు దశల్లో పూర్తి చేయనున్నారు. రహదారి నిర్మాణ పనుల్లో జాప్యంపై గతంలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఈ రహదారి పనులను రాజ్‌పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థకు అప్పగించింది జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ.