తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అభిషేక్​ బెనర్జీపై దాడిలో అమిత్ షా హస్తం'

టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై ఇటీవల జరిగిన దాడి వెనక కేంద్ర హోంమంత్రి అమిత్ షా హస్తం ఉందని బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. పోలీసుల ఎదుటే దాడి జరిగినా.. వారు అడ్డుకోలేదని అన్నారు. ఇలాంటి చర్యలకు తలవంచబోమని స్పష్టం చేశారు.

didi
మమతా బెనర్జీ

By

Published : Aug 9, 2021, 1:29 PM IST

తృణమూల్​ కాంగ్రెస్​ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సహా పార్టీ కార్యకర్తలపై త్రిపురలో జరిగిన దాడిపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈ ఘటన వెనక కేంద్ర హోంమంత్రి అమిత్ షా హస్తం ఉందని ఆరోపించారు. ఇందుకు ఆయనే బాధ్యత వహించాలని అన్నారు. ఇలాంటి చర్యలకు తాను తలవంచబోనని దీదీ స్పష్టం చేశారు. త్రిపురలో గెలిచేది తామేనని ధీమా వ్యక్తం చేశారు

ఆదివారం జరిగిన ఘర్షణలో గాయపడిన టీఎంసీ కార్యకర్తను దీదీ పరామర్శించారు. కోల్​కతాలోని ఎస్ఎస్​కేఎం ఆస్పత్రికి వెళ్లి బాధితుడితో మాట్లాడారు.

టీఎంసీ కార్యకర్తను పరామర్శిస్తున్న దీదీ

"త్రిపుర, అసోం, యూపీ రాష్ట్రాల్లో భాజపా అరాచక పాలన నడుస్తోంది. కాషాయ పార్టీ అధికారంలో ఉన్న ప్రతి చోట పరిస్థితి ఇలాగే ఉంది. అభిషేక్​తో పాటు పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. కేంద్ర హోంమంత్రి మద్దతు లేకుండా ఇలాంటి దాడులు జరగవు. త్రిపుర పోలీసుల ఎదుటే ఈ దాడి జరిగింది. వారు మౌన ప్రేక్షకుల్లా ఉండిపోయారు. ఇలాంటి దాడులు చేయాలని ఆదేశించే ధైర్యం త్రిపుర ముఖ్యమంత్రికి లేదు. ఈ ఘటన వెనక ఉన్న హస్తం కేంద్ర హోంమంత్రిదే."

-మమతా బెనర్జీ, బంగాల్ సీఎం

గత మంగళవారం త్రిపురలో పర్యటిస్తున్న సందర్భంగా అభిషేక్ బెనర్జీ కాన్వాయ్​పై దాడి జరిగింది. ఈ కుట్ర వెనక భాజపా ఉందని అప్పుడే అభిషేక్ ఆరోపించారు. మరో ఘటనలో టీఎంసీ కార్యకర్తలు గాయపడ్డారు.

ఇదీ చదవండి:దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కాన్వాయ్​పై దాడి

ABOUT THE AUTHOR

...view details