దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వైరస్ బాధితులుగా మారే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పలు ఆసుపత్రుల్లో పడకల కొరత ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో తమ వద్ద ఉన్న ఉన్న కొవిడ్ కోచ్‌ల(బోగీలు)ను వినియోగించుకోవాలని అన్ని రాష్ట్రాలను రైల్వే శాఖ కోరింది. ఇప్పటికే తమ వద్ద 4,000 కోచ్‌లు సిద్ధంగా ఉన్నాయని 'ఈటీవీ భారత్'తో రైల్వే బోర్డు ఛైర్మన్ సునీత్ శర్మ చెప్పారు.
"దాదాపు 4,000 కొవిడ్ కోచ్‌లు సిద్ధంగా ఉన్నాయి. ఆ బోగీల్లో కొవిడ్ చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ సూచనల ప్రకారం దేశవ్యాప్తంగా 220 ప్రదేశాల్లో ఈ కోచ్‌లను ఏర్పాటు చేసి పెట్టాం. ఇటీవల మహారాష్ట్ర నందుర్బార్ జిల్లా అధికారులు మమ్మల్ని సంప్రదించారు. దాంతో 20 బోగీలను ఆ ప్రాంతంలో నిలిపాం."
-సునీత్ శర్మ, రైల్వే బోర్డు ఛైర్మన్.
గతేడాది కరోనా మొదటి దశ వ్యాప్తి సమయంలో.. కొవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు కొవిడ్ బోగీలను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం.. స్వల్ప లక్షణాలతో ఉన్నవారికి చికిత్స అందించేందుకు వీటిని సిద్ధం చేసింది. కానీ, ఈ బోగీలు.. వినియోగానికి నోచుకోలేదు. అయితే.. ప్రస్తుతం కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ కొవిడ్ బోగీల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.