మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే రాజీనామాతో.. రాజకీయ సంక్షోభం ముగిసినట్లే కనిస్తోంది. భాజపాకు శిందే వర్గం మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ క్రమంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ కోష్యారీ భాజపాను ఎప్పుడు ఆహ్వానిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది.
భాజపా కోర్ కమిటీ సమావేశం:ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా గవర్నర్‌ను సంప్రదించే విషయంపై చర్చించేందుకు భాజపా కోర్ కమిటీ సమావేమైంది. పార్టీ ముఖ్య నాయకులు ఇప్పటికే ముంబయికి చేరుకున్నారు. సమావేశం తర్వాత భాజపా తమ నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలు కన్పిస్తున్నాయి. శిందేకు ఉపముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేయనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఠాక్రేపై తిరుగుబాటు చేసిన మంత్రులకు మళ్లీ అవే శాఖలు దక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం భాజపా, శిందే వర్గం గవర్నర్‌ను కలిస్తే.. రేపు సీఎం, డిప్యూటీ సీఎం ప్రమాణస్వీకారం జరిగే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రెబల్స్‌లో మొత్తం 12 మందికి మంత్రి పదవులు దక్కే అవకాశముంది. దీంతో రెబల్స్ మద్దతుతో భాజపా ఏర్పాటు ఖాయంగానే కన్పిస్తోంది. తమకు 170 మంది సభ్యుల మద్దతు ఉందని భాజపా చెబుతోంది.
రెబల్ ఎమ్మెల్యేలతో శిందే సమావేశం:ఇదిలా ఉంటే.. శిందే వర్గం తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా ప్రస్తుతం గోవాలోనే ఉన్నారు. గురువారం రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి 'శాసనసభా పక్ష' సమావేశం నిర్వహించారు శిందే. ఠాక్రేపై తిరుగుబాటు చేసిన తర్వాత అసలైన శివసేన వర్గం తమదేనని శిందే చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శాసనసభాపక్ష నేత హోదాలో ఆయన గురువారం సమావేశం నిర్వహించడం గమనార్హం. సాయంత్రం రెబల్ ఎమ్మెల్యేలు ముంబయి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.