తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొవిడ్ బాధితుల కోసం కాంగ్రెస్ 'హెల్ప్​లైన్' - హలో డాక్టర్​ పేరుతో హెల్ప్​లైన్ ఏర్పాటు చేసిన ఏఐసీసీ

దేశంలో కరోనా మహమ్మారి విధ్వంసం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రజలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ. కొవిడ్ బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్​లైన్​ను ఏర్పాటు చేశారు.

rahul gandhi, congress leader
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

By

Published : May 1, 2021, 2:46 PM IST

రెండో దశలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజుకు లక్షల కొద్దీ కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో దేశంలోని దాదాపు అన్ని ఆస్పత్రులు కరోనా బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. పడకలు చాలక, వైద్యులు అందుబాటులో లేక రోగులు అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో బాధితులకు అండగా ఉండేందుకు ముందుకొచ్చారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. కరోనా రోగులకు వైద్య సాయం అందించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

"ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌ కలిసికట్టుగా ఉండి ఒకరికొకరు సాయం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా బాధితుల కోసం 'హలో డాక్టర్‌' పేరుతో మెడికల్‌ అడ్వైజరీ హెల్ప్‌లైన్‌ ప్రారంభించాం. వైద్య సలహాల కోసం +919983836838 నంబరుకు ఫోన్‌ చేయండి" అని రాహుల్‌ శనివారం ట్వీట్‌ చేశారు. డాక్టర్లు, వైద్య నిపుణులు ఇందులో చేరి బాధితులకు అవసరమైన సాయం అందించాలని అభ్యర్థించారు. ప్రస్తుతమున్న ఆరోగ్య సంక్షోభ పరిస్థితుల్లో ఏఐసీసీ ప్రారంభించిన ఈ హలో డాక్టర్‌ కార్యక్రమంలో వైద్యులు స్వచ్ఛందంగా భాగస్వాములై ప్రజలకు సాయం చేయాలని కోరారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్‌ను కూడా రాహుల్‌ జత చేశారు.

దేశవ్యాప్తంగా కరోనా రక్కసి విరుచుకుపడుతోంది. తాజాగా రోజువారీ కేసులు 4లక్షలు దాటడం ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్‌ వల్ల మరో 3500 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు శనివారం పేర్కొన్నాయి.

ఇవీ చదవండి:రోడ్డు పక్కన 2 లక్షల కరోనా టీకాలు

'కరోనా కట్టడికి జాతీయ విధానాన్ని రూపొందించాలి'

ABOUT THE AUTHOR

...view details