Ahmednagar Train Fire : మహారాష్ట్రలో ఓ రైలు ఘోర అగ్నిప్రమాదానికి గురైంది. డెము రైలులోని 5 కోచ్‌లలో మంటలు చెలరేగాయి. అహ్మద్‌నగర్, నారాయణ్‌పుర్ స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు రైలులో మంటలు సంభవించాయని అధికారులు వెల్లడించారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. మంటలు వ్యాపించగానే రైలులో ఉన్నవారిని కిందకు దించినట్లు చెప్పారు. మంటలు చెలరేగిన కోచ్‌లలో ఎవరూ చిక్కుకోలేదని, అధికారులు వెంటనే అగ్నిమాపక బృందాలకు సమాచారం అందించారని వివరించారు. రైలు బీడ్ జిల్లాలోని ఆష్టి స్టేషన్ నుంచి అహ్మద్ నగర్‌కు వెళ్తోందని అధికారులు తెలిపారు.
'సాయంత్రం 4.10 నాటికి మంటలు అదుపులోకి'
"01402 నంబర్ రైలు అహ్మద్‌నగర్‌కు వెళ్తోంది. దారి మధ్యలో రైలులో మంటలు చెలరేగాయి. ప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదు. మంటలు మధ్యాహ్నం 3 గంటల సమయంలో మొదలయ్యాయి. మంటలు వ్యాపించక ముందే బోగీలో ఉన్నవారంతా కిందకు దిగేశారు. గార్డు పక్కన ఉండే బ్రేక్ వ్యానుతో పాటు దానికి అనుబంధంగా ఉన్న నాలుగు కోచ్‌లకు మంటలు వ్యాపించాయి. అహ్మద్‌నగర్ నుంచి వెంటనే అంబులెన్సులను పిలిపించాం. సాయంత్రం 4.10 నాటికి మంటలు అదుపులోకి వచ్చాయి. యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్‌ను పుణెలోని దౌండ్ స్టేషన్ నుంచి ఘటనా ప్రదేశానికి రప్పించాం" అని రైల్వే అధికారులు వివరించారు.